Telangana High Court fire on officials due to Food Poison in Schools : తెలంగాణలోని నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించడంపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల్లోనే మూడుసార్లు భోజనం వికటించి విద్యార్థులు ఆస్పత్రి పాలవడమేంటని ప్రశ్నించింది. ఇలా జరుగుతుంటే సంబంధిత అధికారులు నిద్రపోతున్నారా? అని మండిపడింది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనడానికి ఇదే నిదర్శనమని వెల్లడించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకోవడం లేదంది. అధికారులకు సైతం పిల్లలున్నారు కదా. దీనిని దృష్టిలో పెట్టుకొని మానవత్వంతో వ్యవహరించాలని హైకోర్టు తెలిపింది.
ఆ అధికారి వద్ద ఫోన్ లేదా? : పాఠశాలలో భోజనం వికటించిన విషయమై కౌంటర్ దాఖలు చేయడానికి వారం రోజుల సమయం కావాలని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోరడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా కేంద్రంలో ఉన్న సంబంధిత అధికారిని సంప్రదించడానికి వారం రోజుల వ్యవధి ఎందుకు? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ సదరు అధికారి వద్ద ఫోన్ లేదా? ఇంటర్‌నెట్ సౌకర్యం లేదా? అలాగాక ఏమైన మైనస్ 30 డిగ్రీల వాతావరణంలో ఉన్న అధికారిని సంప్రదించడానికి సమయం కావాలా? అని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పిల్లలపట్ల ఈ విధంగానే వ్యవహరిస్తారా? అని మండిపడింది. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా? అని హైకోర్టు వ్యాఖ్యనించింది.
ఫుడ్‌పాయిజన్‌తో ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి - 21రోజులు వెంటిలేటర్‌పైనే
అధికారులు సిగ్గుపడాలి : నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే కేవలం 5 నిమిషాల్లోనే హాజరవుతారని తెలిపింది. అలాంటిది వివరణ ఇవ్వడానికి వారం రోజుల వ్యవధి ఎందుకని? హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల సంబంధిత అధికారులు సిగ్గుపడాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది. వెంటనే అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ విచారణ మధ్యలో కలుగజేసుకొని ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి భోజన విరామం తర్వాత సమర్పిస్తామని హైకోర్టుకు వెల్లడించారు.
రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించడం లేదని గురుతేజ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్ రావు ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ మధ్యాహ్నం భోజనం వికటిస్తోందని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది అయిన చిక్కుడు ప్రభాకర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. మధ్యాహ్న భోజన విషయంలో కేంద్రం స్పష్టమైన మార్గనిర్దేశకాలు జారీ చేసిందని కోర్టుకు ఆయన వివరించారు. వీటిని పాటించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు వెలుగుచూస్తున్నాయని ప్రభాకర్ వాదించారు.
ఆ వంటకం తిని మహిళ మృతి - మరో 50 మంది ఆస్పత్రికి - నందినగర్‌లో దారుణం
చిన్నారులను చిదిమేసిన కలుషితాహారం- వసతిగృహ నిర్వాహకుడు అరెస్ట్ - Food Poison Children Death Case