Telangana Group 4 Candidates Merit List : గ్రూప్-4 అభ్యర్థులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు ఈనెల 13 నుంచి వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకునేందుకు కమిషన్ అవకాశం కల్పించింది. ధ్రువపత్రాల పరిశీలనకు వచ్చే అభ్యర్థులు తప్పనిసరిగా వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది.
అలా చేసిన వారిని మాత్రమే విడతల వారీగా ధ్రువపత్రాల పరిశీలనకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. అయితే అభ్యర్థులు వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సిన రోజువారీ తేదీలను కమిషన్ వెబ్సైట్లో పొందుపరుస్తామని చెప్పింది. ఇప్పటికే రాష్ట్రంలో 8,180 గ్రూప్ -4 పోస్టుల భర్తీకి పరీక్షను నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9న జనరల్ ర్యాంకుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈ క్రమంలో కీలకమైన ధ్రువపత్రాల పరిశీలన తేదీలను ఖారు చేసి కమిషన్ విడుదల చేసింది.
ధ్రువపత్రాల వెరిఫికేషన్ కోసం అవసరమైన పత్రాలు :
- కులధ్రువీకరణ పత్రం
- బీసీ నాన్ క్రీమీలేయర్
- దివ్యాంగ ధ్రువీకరణ పత్రం
- ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్
- నివాస ధ్రువీకరణ పత్రం(స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే)
- ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 2021-22 ఏడాదికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ ధ్రువీకణ పత్రం
- హాల్ టికెట్
- పుట్టిన తేదీ సర్టిఫికేట్(ఎస్ఎస్సీ మెమో)
- పీహెచ్ సర్టిఫికేట్ (SADERAM సర్టిఫికేట్)
- సర్వీసులో ఉన్న అభ్యర్థులు ఎన్ఓసీ సర్టిఫికేట్ తీసుకురావాలి
- తాజా 3 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
గమనిక : ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
అన్ని సర్టిఫికెట్లతో సిద్ధంగా ఉండాలి : పరిశీలన కోసం అభ్యర్థులు అవసరమైన అన్ని సర్టిఫికేట్లతో సిద్ధంగా ఉండాలని కమిషన్ సూచించింది. అలాగే వాటన్నింటిని దగ్గర ఉంచుకోవాలని తెలిపింది. ధ్రువీకరణ పత్రాల పరిశీలన సమయంలో తప్పనిసరిగా ఈ పత్రాలన్నీ సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే టీజీపీఎస్సీ అభ్యర్థులకు అదనపు గడువు ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఈ గ్రూప్ 4 పరీక్షకు సంబంధించి 2022లోనే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే పరీక్ష మాత్రం 2023 జులై నెలలో జరిగింది. ఇప్పటికే జనరల్ ర్యాంకులను ప్రకటించగా ఎన్నికల కోడ్ రావడంతో మెరిట్ జాబితాను ఆలస్యం చేసింది. ఇప్పుడు మెరిట్ జాబితాను విడుదల చేసి వెబ్ ఆప్షన్స్ తేదీలను కూడా టీజీపీఎస్సీ ప్రకటించింది.