Telangana Ground Water Resources Department Report : భాగ్యనగరంలో భూగర్భజలాలను అధికంగా వినియోగిస్తున్నారని రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ తెలిపింది. ఆ శాఖ 2023 సంవత్సరానికి సంబందించిన రాష్ట్రంలో నేలలోకి ఇంకిన నీటి పరిమాణం, తోడివేతపై నివేదిక విడుదల చేసింది. గతేడాది తక్కువ నీరు ఇంకి, ఎక్కువ నీరు తోడిన జిల్లాల్లో హైదరాబాద్, నారాయణ పేట, మేడ్చల్, మహబూబ్‌నగర్ జిల్లాలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి. అత్యధికంగా భూగర్భ జలాలు వినియోగించిన జిల్లాల్లో హైదరాబాద్ తర్వాత రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయని వెల్లడించింది.
Ground Water Level in Telangana : వర్షాలు, నీటివనరుల రూపంలో నేలలోకి ఇంకే నీటిని పది కాలాల పాటు నిల్వ ఉంచుకోకపోతే సమస్యలు తలెత్తుతాయని భూగర్భ జలవనరుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటిమట్టం అడుగంటితే భూతాపం పెరగడం, నీటిలో ఫ్లోరైడ్ వంటి విషపూరిత రసాయనాల గాఢత పెరగడం తదితర సమస్యలు వస్తాయని సూచిస్తున్నారు. వరుసగా నీటి ఎద్దడి ఏర్పడితే, తోడుకోవడానికి నీళ్లే ఉండవన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో గోదావరి, కృష్ణా, మంజీర నదుల నుంచి ఉపరితల జలాలు సరఫరా అవుతున్నా, ఇక్కడ నగర వాసులు భూగర్భ జలాలను విపరీతంగా ఉపయోగించుకోవడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
GROUND WATER: అడుగంటుతోన్న భూగర్భ జలాలు.. అష్టకష్టాలు పడుతున్న రైతన్నలు
రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ నివేదిక ప్రకారం జిల్లాల వారీగా నమోదైన నీటి వివరాలు :
భూగర్భ జలాల తక్కువగా నమోదైన జిల్లాలు | శాతం | భూగర్భ జలాల ఎక్కువగా నమోదైన జిల్లాలు | శాతం |
కుమురం భీం ఆసిఫాబాద్ | 15 | హైదరాబాద్ | 98 |
సూర్యాపేట | 18 | రాజన్న సిరిసిల్ల | 66 |
మంచిర్యాల | 23 | సిద్దిపేట | 63 |
ములుగు | 23 | హనుమకొండ | 60 |
జోగులాంబ గద్వాల | 24 | మేడ్చల్ మల్గాజిగిరి | 60 |
పెద్దపల్లి | 27 | మహబూబ్‌నగర్ | 58 |
ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్ | 28 | వరంగల్ | 57 |
Status of Ground Water : నగరాలు, పట్టణాలు కాంక్రీట్ అరణ్యాలుగా మారుతుండడంతో నీరు ఇంకే పరిమాణంపై ప్రభావం చూపుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ నగరం రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో నేల కనిపించనంతంగా విస్తరించింది. దీనివల్ల కురుస్తున్న వర్షం నీరు డ్రైనేజీ కాలువల ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్తోంది. అందువల్ల హైదరాబాద్ పరిధిలో నేలలోకి ఇంకే నీరు తగ్గుతోందని వివరించారు.
గతేడాది అతి తక్కువ నీరు ఇంకి, ఎక్కువ వినియోగించిన జిల్లాల వివరాలు
- హైదరాబాద్ జిల్లాలో 5,808 కోట్ల లీటర్ల నీరు ఇంకగా, 5,438 కోట్ల లీటర్లను ఉపయోగించుకున్నారు.
- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 8,879 కోట్ల లీటర్ల నీరు ఇంకగా, 5,296 కోట్ల లీటర్లు తోడేశారు.
- మహబూబ్‌నగర్ జిల్లాలో 33,629 కోట్ల లీటర్ల నీరు చేరితే, 19,784 కోట్ల లీటర్ల నీటిని వినియోగించుకున్నారు.
- నారాయణపేట జిల్లాలో 28,773 కోట్ల లీటర్ల నీరు ఇంకగా, 11,343 కోట్ల లీటర్లు తోడేశారు.
ఎక్కువ నీరు ఇంకి, తక్కువ వినియోగించిన జిల్లాల వివరాలు
- సూర్యాపేట జిల్లాలో గతేడాది 1.40 లక్షల కోట్ల లీటర్లు నేలలోకి చేరుతే 25,305 కోట్ల లీటర్ల నీటిని ఉపయోగించుకున్నారు.
- నల్గొండ జిల్లాలో 1.38 లక్షల కోట్ల లీటర్లు నేలలోకి నీరు ఇంకితే, 57,418 కోట్ల లీటర్లు వినియోగించుకున్నారు.