Telangana Govt on Joint Examination For Govt Jobs : జాబ్ క్యాలెండర్‌లో ఎదురయ్యే సాంకేతిక సమస్యల్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ప్రభుత్వం, సొసైటీలు, కార్పొరేషన్లలో ఒకే హోదా, కేటగిరి, విద్యార్హత కలిగిన ఉద్యోగాలకు వేర్వేరు నియామక సంస్థలు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసినప్పటికీ, రాత పరీక్షను మాత్రం ఉమ్మడిగా నిర్వహించాలన్న అంశాన్ని పరిశీలిస్తోంది. దీనిపై త్వరలో ఆయా నియామక సంస్థలతో సమన్వయ సమావేశాలు జరపనుంది. ఈ మేరకు జాబ్ క్యాలెండర్‌లో ఒకే కేటగిరి, హోదా, విద్యార్హతతో కూడిన నోటిఫికేషన్ల వివరాలు సేకరిస్తోంది.
తిరిగి బ్యాక్‌లాగ్ ఉండే అవకాశం : రాష్ట్రంలో ఇప్పటికి 9 వేలకు పైగా గురుకుల నియామకాలు పూర్తయ్యాయి. మరోవైపు డీఎస్సీ పరీక్ష కూడా ముగిసింది. జూనియర్ లెక్చరర్ పోస్టులకు 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడించింది. గురుకులాల్లో నియమితులైన వారిలో చాలా మంది ఈ పోస్టులకూ ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువ. దీంతో గురుకుల పోస్టులు తిరిగి బ్యాక్‌లాగ్ అయ్యే అవకాశముంటుంది.
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - ఆ పోస్టులన్నీ ఇకపై గ్రూప్-3లోకి - Telangana Job Notification Reforms
డిగ్రీ కళాశాలలు, గురుకుల డిగ్రీ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ ఇతర తత్సమాన స్థాయి పోస్టులకు వచ్చే ఏడాది జూన్‌లో టీజీపీఎస్సీ, గురుకుల నియామక బోర్డులు వేర్వేరుగా ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తారు. ఈ పోస్టులన్నింటికి విద్యార్హతలు ఒకటే. అయితే రెండు నియామక సంస్థలు ఒకే సమయంలో వేర్వేరుగా నిర్వహిస్తే పరీక్షల మధ్య గడువు సమస్యలు వస్తాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి పరీక్ష నిర్వహించడంపై నియామక సంస్థలు ప్రభుత్వంతో చర్చలు జరపనున్నాయి.
ఈ రెండింటికి ఉమ్మడి పరీక్ష, మెరిట్ లిస్ట్ మాత్రం సెపరేట్ : ఇంజినీరింగ్ డిగ్రీ కనీస అర్హతతో విద్యుత్తు సంస్థలో ఉద్యోగాలకు ట్రాన్స్‌కో, ఇంజినీరింగ్ సర్వీసుల్లో ఏఈ, ఏఈఈ, సబ్‌ఇంజినీర్ తదితర పోస్టులకు టీజీపీఎస్సీ ఈ ఏడాది అక్టోబరులో నోటిఫికేషన్లు జారీ చేయనుంది. ఈ రెండింటికీ జనవరిలో నియామక రాత పరీక్షలు నిర్వహించనున్నారు. వీటికి కూడా ఉమ్మడి పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఉమ్మడి రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల నుంచి ఆప్షన్లు తీసుకుని వేర్వేరుగా మెరిట్ జాబితాలు వెల్లడించడం ద్వారా బ్యాక్‌లాగ్ పోస్టులు లేకుండా చూడవచ్చని భావిస్తోంది.
రాష్ట్రంలో ఇక ఏటా జాబ్ క్యాలెండర్ - ప్రామాణిక ముసాయిదా సిద్ధం చేస్తున్న టీఎస్‌పీఎస్సీ