Minister Uttam Review On Devadula Lift Irrigation Project Today : ఉమ్మడి వరంగల్ జిల్లాకు జలప్రదాయినిగా భావించే జే-చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కాంగ్రెస్ కలల ప్రాజెక్టుగా భావించే ఈ పథకాన్ని పూర్తి చేయడమే తొలి ప్రాధాన్యంగా తీసుకుంది. 2 దశాబ్దాలుగా పూర్తికాని దేవాదుల ప్రాజెక్టును, వచ్చే ఏడాది చివరి కల్లా ముగించి నీరందించాలని లక్ష్యం పెట్టుకుంది.
ఇందులో భాగంగా ఇప్పటివరకు ఉన్న ప్రాజెక్టు స్థితిగతులను సమీక్షించేందుకు మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనకు రానున్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడంలోని దేవాదుల ప్రాజెక్టు పంపింగ్ స్టేషన్ వద్ద నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సహా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
దేవాదుల ఎత్తిపోతల పూర్తి చేసేలా సర్కార్ కసరత్తు : ఉమ్మడి వరంగల్ సహా కరీంనగర్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని 5 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా, 2004లో అప్పటి కాంగ్రెస్ సర్కార్ దేవాదులకు శ్రీకారం చుట్టింది. 6,016 కోట్ల రూపాయల అంచనాతో మొదలు పెట్టగా, ఫేజ్-2, 3లతో కలిపి రూ.17,500 కోట్లకు అంచనా వ్యయం పెరిగింది. ఇప్పటివరకు రూ.14,188 కోట్లు ఖర్చు కాగా రెండు దశల్లో కలిపి 12 రిజర్వాయర్లు, 11 పంప్‌హౌజ్‌లు నిర్మించారు.
మొత్తం 3లక్షల 17వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుండగా, మూడో దశ పూర్తైతే మరో 2,40,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు రానున్నాయి. మొత్తం 33,224 ఎకరాల భూసేకరణకు నిర్ణయించగా, ఇప్పటికి వరకు 30,268 ఎకరాల భూమిని సేకరించారు. మరో 2,957 ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మల్టీస్టోరేజి ఎత్తిపోతల పథకంగా పేరొందిన ఈ ప్రాజెక్టులో 39.16 టీఎమ్సీల నీటిని, 170 రోజులపాటు ఎత్తిపోయనున్నారు. ఫేజ్-1, 2, 3 లకు కలిపి మొత్తం 499 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగించనున్నారు.
దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న సర్కార్, తొలిసారిగా ప్రాజెక్టు పంప్‌హౌస్ వద్ద ఉన్నతస్థాయి సమీక్ష చేస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలు దేరనున్న మంత్రులు, ములుగు జిల్లా తుపాకుల గూడెం వద్దకు చేరుకుని దేవాదుల పంపింగ్ స్టేషన్‌ను పరిశీలిస్తారు. మధ్యాహ్నం సమీక్ష అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళతారు.
కోట్లు ఖర్చు చేసి కూడా కేసీఆర్ అందరికీ నీళ్లివ్వలేదు : భట్టి విక్రమార్క - BHATTI FIRES ON BRS RULING