Godavari Second Phase Works : భాగ్యనగర వాసుల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాగునీటి అవసరాలు మరింత మెరుగుపర్చేందుకు గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-2కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఉత్తర్వుల జారీ సహా రెండోదశ పనుల కోసం రూ.5,560కోట్లు మంజూరుచేశారు. ఆ పథకం ద్వారా నగరానికి అదనపు జలాలను తరలించడంతో పాటు హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలు పునరుజ్జీవం అవుతాయని ప్రభుత్వం పేర్కొంది.
Godavari Drinking Water 2nd Phase : ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలకు అన్ని వనరుల నుంచి 580 ఎంజీడీల నుంచి 600 ఎంజీడీలు సరఫరా చేస్తున్నారు. 2030 నాటికి నీటి అవసరాలు మరో 170 ఎంజీడీలు, 2050 నాటికి 1014 ఎంజీడీలు పెరగవచ్చన్న అంచనాతో అదనపు జలాల్ని సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరి నుంచి 30 టీఎంసీలు వాడుకునే వెసులుబాటు ఉండటంతో అదనపు జలాల కోసం గోదావరి ప్రాజెక్టు ఫేజ్-2ను చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించింది.
మరో 15 టీఎంసీలు వాడుకునే దిశగా : గోదావరి డ్రికింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్-1 కింద హైదరాబాద్ ప్రజల నీటి అవసరాల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలమండలి ఇప్పటికే 10 టీఎంసీలను సర్కారు తరలిస్తోంది. తాజాగా రెండోదశతో మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి మరో 15 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉంది. ఆ 15 టీఎంసీల్లో 10 టీఎంసీలు నగర ప్రజల తాగునీటి అవసరాలకుపోగా మూసీ ప్రక్షాళనలో భాగంగా జంట జలాశయాలను పునరుజ్జీవనం చేసేందుకు మిగిలిన 5 టీఎంసీలను ఉపయోగించనున్నారు. ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ని వాప్కోస్ సిద్ధంచేసింది.
రెండేళ్ల వ్యవధిలో : ఇందులో పంప్ హౌజ్‌లు, సబ్ స్టేషన్లు, మల్లన్న సాగర్ నుంచి ఘన్‌పూర్ వరకు 3600 ఎంఎం డయా భారీ పైపు లైన్ నిర్మించనున్నారు. ఘన్‌పూర్, శామీర్ పేట్ వద్ద 780 ఎంఎల్డీల సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఘన్ పూర్ నుంచి ముత్తంగి వరకు పంపింగ్ మెయిన్ నిర్మాణంతో పాటు ఇతర పనులు చేపట్టనున్నారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ -1 ద్వారా 163 ఎంజీడీల నీరు సరఫరా చేస్తున్నారు.
Govt Allocate Funds For Drinking water : హైదరాబాద్ మహానగర సమగ్రాభివృద్ధికి ప్రాధ్యానతనిస్తున్న ప్రభుత్వం తాగునీటి సరఫరా, మురుగు నీటి శుద్ధికి ఇటీవల బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. ఎస్టీపీల కోసం 3,849 కోట్లు మంజూరు చేయగా తాజాగా తాగునీటి సరఫరా, మూసీ ప్రక్షాళన, జంట జలాశయాల పునరుజ్జీవం కోసం మరో 5,560 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇప్పటి దాకా జలమండలికి దాదాపు రూ.9,410 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. గత పదేళ్లలో జలమండలికి ఆ స్థాయిలో నిధులు కేటాయించడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు.
తెలంగాణ, ఏపీ తాగునీటి కోసం 9 టీఎంసీలు కేటాయించిన కేఆర్‌ఎంబీ - KRMB issued orders