Telangana Yasangi Paddy Procurement Record : రాష్ట్రవ్యాప్తంగా 6,345 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా యాసంగి సీజన్‌లో 47.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ధాన్యం విక్రయించిన 8,35,109 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,355.18 కోట్లు జమ చేసినట్లు స్పష్టం చేసింది. వడ్లను అమ్మిన రైతులకు మూడు రోజుల్లోనే ఖాతాల్లో డబ్బు జమ చేసినట్లు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.రాష్ట్రవ్యాప్తంగా 7,178 ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసింది.
గత ప్రభుత్వ హయాంలో యాసంగి సీజన్‌లో ఏప్రిల్ నెలలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యేవి. కానీ ఈసారి దాదాపు రెండు వారాల ముందుగానే అంటే మార్చి 25 నుంచే ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యాయి. అయితే జూన్ 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 47.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. ఇప్పటికే చాలా చోట్ల ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి అయింది. ఇంకా మరో 10 రోజుల పాటు రైతులు ధాన్యం కేంద్రాలకు వడ్లను తీసుకువచ్చే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ భావిస్తోంది. ఆలస్యంగా వరి పంటను వేసిన రైతులకు మాత్రం పౌరసరఫరాల శాఖ శుభవార్త చెప్పిందనే చెప్పాలి.
వీరి కోసం ఈ నెలాఖరు వరకు అవసరమైన చోట్ల కేంద్రాలు తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. యాసంగి ధాన్యం పెరిగే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసినంతగా ధాన్యం కొనుగోళ్లు జరగలేదు. యాసంగి సీజన్‌లో దాదాపు 75.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని ముందుగానే పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. ఎందుకంటే మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువ సొమ్ము లభించడం, ప్రైవేటు వ్యాపారులు ధాన్యం కోసం పోటీ పడడం మంచి ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో ధాన్యం కొనుగోళ్లు పెరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. కానీ సర్కారు అనుకున్న విధంగా ధాన్యం రాలేదు.
జగిత్యాలలో అత్యధిక ధాన్యం కొనుగోళ్లు : ఈ యాసంగి సీజన్‌లో ధాన్యం సేకరణలో ముందువరుసలో జగిత్యాల జిల్లా నిలిచింది. ఆ తర్వాత కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాలు నిలిచాయి. ఆ తర్వాత సిద్దిపేట, సిరిసిల్ల, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, జనగామ జిల్లాలు ముందంజలో ఉన్నాయని సర్కారు తెలిపింది. మిగిలిన జిల్లాల్లో మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని చెప్పింది.