Telangana Govt Introduce Resolution in Assembly on Caste Census : కులగణన కోసం ఇంటింటి కుటుంబ సర్వే చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. సామాజిక, ఆర్థిక, విద్య అవకాశాల కోసమే కుటుంబ సర్వే చేపడుతున్నామని వివరించారు. నేడు శాసనసభలో సమగ్ర కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టి, ఆమోదం తెలిపింది. ఈ తీర్మానాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabakar) ప్రవేశపెట్టారు. అనంతరం సభను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
ఉపాధి, రాజకీయ అవకాశాలు, ప్రణాళికల కోసమే ఈ సర్వే అంటూ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు, ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే సర్వేనని చెప్పారు. బలహీనవర్గాలను బలోపేతం చేయడమే ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. బలహీన వర్గాలను ఆర్థికంగా నిలబెట్టాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని వివరించారు. పాలితులుగా ఉన్న వారిని పాలకులుగా చేయడమే తమ ఉద్దేశ్యమని తెలిపారు.
Bihar Caste Census Supreme Court : 'కులగణన అధికారం కేంద్రానిదే! రాష్ట్రాలకు సంబంధం లేదు'
Caste Census in Telangana : జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే కుల గణన(Caste Census) చేపడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయటపెట్టలేదని విమర్శించారు. సమగ్ర సర్వే వివరాలను రహస్యంగా ఉంచి ఎన్నికలప్పుడు వాడుకున్నారని బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని పొన్నం ప్రభాకర్ ఈ తీర్మానం ప్రవేశపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు కొన్ని అనుమానాలు వచ్చే విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. చర్చను ప్రతిపక్షం తప్పుదోవ పట్టిస్తోందన్నారు. గత ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే(Family Survey) బయటపెట్టారా అంటూ ప్రశ్నించారు. ఎవరికైనా అనుమానం ఉంటే చెబితే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఎవరైనా సూచనలు ఇచ్చినా వాటిని పరిగణనలోకి తీసుకుంటామని సీఎం తెలిపారు.
"మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రజలకు కొన్ని అనుమానాలు వచ్చే విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోంది. చర్చను ప్రతిపక్షం తప్పుదోవ పట్టిస్తోంది. గత ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఎందుకు బయటపెట్టలేదు? ఎవరికైనా అనుమానం ఉంటే చెబితే పరిగణనలోకి తీసుకుంటాము. ఎవరైనా సూచనలు ఇస్తే తీసుకుంటాము. ఉపాధి, రాజకీయ అవకాశాలు, ప్రణాళికల కోసమే ఈ సర్వే." - రేవంత్ రెడ్డి, సీఎం
కేవలం కులగణనపై తీర్మానం మాత్రమే ప్రవేశపెట్టాము : అనంతకు ముందు అసెంబ్లీలో సమగ్ర కులగణనపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్రమంతా సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. కులగణన కోసం బిల్లు అవసరం లేదన్నారు. గతంలోనూ బిల్లు లేకుండానే కులగణన జరిగిందని గుర్తు చేశారు. కులగణనకు చిత్తశుద్ధి అవసరం, బిల్లు కాదన్నారు. గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినా వివరాలు బయటపెట్టలేదని మంత్రి విమర్శించారు. కులగణనపై అందరి సలహాలు తీసుకొని ముందుకెళ్తామని చెప్పారు. బీసీ మంత్రిత్వ శాఖ కోసం దిల్లీలో ధర్నాలు జరిగాయి కానీ కనీసం కేంద్ర ప్రభుత్వం బీసీ శాఖను కూడా ఏర్పాటు చేయలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు.
'రేవంత్ సాబ్ బీఆర్ఎస్ నుంచి ఏ ఇబ్బంది ఉండదు - కానీ మీ వాళ్లతో మాత్రం జరభద్రం'