Telangana Govt Felicitates Padma Award Winners 2024 : ఈ ఏడాది పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి సహా పద్మ పురస్కారాలు అందుకున్న వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాలువా, మెమెంటోలతో సత్కరించారు. ఇందులో భాగంగా మట్టిలో మాణిక్యాలను గుర్తించి కేంద్రం పద్మ పురస్కారాలు ఇవ్వడం గొప్ప విషయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.
జీవితంలో పెద్దగా అవార్డులు, సన్మానాలు తీసుకోలేదన్న వెంకయ్యనాయుడు, కేవలం ప్రధాని మోదీ మీద గౌరవంతో పద్మ విభూషణ్ తీసుకున్నానని తెలిపారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారిని రాష్ట్ర ప్రభుత్వం శిల్పకళావేదికగా సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు కళామతల్లికి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు అయితే, చిరంజీవి మూడో కన్ను అని వెంకయ్యనాయుడు కొనియాడారు.
నేను జీవితంలో అవార్డులు, సన్మానాలు పెద్దగా తీసుకోలేదు. ప్రధాని మోదీ మీద గౌరవంతోనే పద్మ విభూషణ్ అవార్డు తీసుకున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అభినందిస్తున్నా. మట్టిలో మాణిక్యాలను గుర్తించి కేంద్రం పద్మ పురస్కారాలు ఇవ్వడం గొప్ప విషయం. చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం రావడం సంతోషంగా ఉంది. తెలుగు కళామతల్లికి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు అయితే, చిరంజీవి మూడో కన్ను. - వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి
ఆ క్షణం అంతాఇంతా ఆనందం కాదు - 'గద్దర్ పురస్కారాలు'గా నంది అవార్డులు మంచి నిర్ణయం : చిరంజీవి
Telangana Padma Award Winners 2024 : ఒక పరిణితి చెందిన రాజనీతిజ్ఞుడు వెంకయ్యనాయుడని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా ఆయన సభ నడిపిన తీరు అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అన్న భట్టి, స్వయంకృషితో ఎదిగిన గొప్ప కథానాయకుడని వ్యాఖ్యానించారు. అనంతరం పద్మ విభూషన్, పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి భట్టి అభినందనలు తెలిపారు.
Central Govt Announced Padma Awards : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu)తో పాటు ఐదుగురిని కేంద్రం పద్మ విభూషణ్‌తో గౌరవించింది. ఈ ఏడాది మొత్తం 132 మందికి ‘పద్మ’ పురస్కారాలు ప్రకటించగా, ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందిని పద్మశ్రీ అవార్డులు వరించాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ అవార్డులను నలుగురికి ప్రకటించారు. తెలంగాణకు చెందిన దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, వేలు ఆనందచారి, ఏపీ నుంచి ఉమామహేశ్వరి ఎంపికయ్యారు.
కంచుకోటను మరోసారి కైవసం చేసుకునేందుకు 'హస్తం' పక్కా ప్లాన్ - నిజామాబాద్ బరిలో ఆ అభ్యర్థి!
నేడు హైదరాబాద్ నుంచి రాంచీకి వెళ్లనున్న ఝార్ఖండ్ ఎమ్మెల్యేలు