Telangana Govt Alert to Munneru Flood Effect Areas : రాష్ట్రంలో వరుణుడు మరోమారు తన ప్రతాపాన్ని చూపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో మున్నేరు వాగుకు మరోసారి వరద ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం ఖమ్మం వద్ద 16 అడుగులకు మున్నేరు వరద ప్రవాహం చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 24 అడుగులు చేరితే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ముందస్తు చర్యలుగా మున్నేరు ముంపు ప్రాంత ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.
మున్నేరు వాగు పొంగి పొర్లే అవకాశం ఉండటంతో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హుటాహుటిన ఖమ్మం బయల్దేరి వెళ్లారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మున్నేరు వాగుకు భారీగా వరద వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి సూచించారు. భారీ వరద పొంచి ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులందరికీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.
లోతట్టు ప్రాంతాలు తక్షణమే ఖాళీ చేయాలి : భారీ వర్షాలతో మున్నేరుకు మరోసారి ప్రవాహం పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు విజ్ఞప్తి చేశారు. గత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. అవసరమైతే సహాయక శిబిరాలు మళ్లీ తెరవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలు వెంటనే అక్కడి నుంచి తరలి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలకు వెళ్లాలని సూచించారు. పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు, ప్రజలకు సహాయ సేవలు నిరంతరం అందుబాటులో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
నేడు ఖమ్మం జిల్లాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన : నేడు ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. ఖమ్మంలోని 16వ డివిజన్ దంసాలపురంలో పర్యటిస్తారు. అనంతరం పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం, రాకాసి తండాలో పర్యటించనున్నట్లు కిషన్ రెడ్డి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడటంతో పాటు నిత్యవసర వస్తువులు పంపిణీ చేయనున్నారు. ముంపు ప్రాంతాల్లో నివారణ చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. బాధితులతో మాట్లాడి ప్రభుత్వం తరఫున చేపట్టిన పునరావాస కార్యక్రమాలపై ఆరా తీయనున్నారు.
కోలుకుంటున్న ఖమ్మం - 860 ప్రత్యేక వైద్య బృందాలతో ఇంటింటి సర్వే - Munneru Flood Victims Recovering
నిండా ముంచిన మున్నేరు - సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ ప్రజలు - Floods in Telangana 2024