TG Govt Submit Report on Flood Damage : తెలంగాణలో పది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా జన జీవనం అస్తవ్యస్తం అయింది. వరదల వల్ల ఏర్పడిన నష్టాన్ని పరిశీలించడానికి దిల్లీ నుంచి కేంద్ర బృందం వచ్చింది. వరదల వల్ల నష్టపోయిన జిల్లాల్లో పర్యటించింది. ఈ బృందానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ వర్షాల కారణంగా రూ.9 వేల కోట్లకు పైనే నష్టం వాటిల్లిందని నివేదిక అందించింది. బాధితులకు పూర్తి స్థాయిలో సాయం చేయాలని విన్నవించింది.
నివేదికలో పొందుపరిచిన అంశాలు :
- భారీ వర్షాల వల్ల వచ్చిన వరదల దాటికి సూర్యాపేట, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, నాగర్ కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మొత్తం 8 రంగాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయని పేర్కొంది.
- ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోని పట్టణాల్లో కాలనీలు, బస్తీలు, లోతట్టు ప్రాంతాలు మునిగి ప్రజా జీవనం అస్తవ్యస్తమైంది. మొదటిగా ప్రాథమిక నష్టం రూ.5,438 కోట్లుగా అంచనా వేయగా, అది దాదాపు రెట్టింపైంది.
- ఇప్పటి వరకు భారీ వర్షాలు, వరదలకు 35 మంది చనిపోయారు. 28,869 ఇళ్లు కూలగా, 17,916 మంది నిరాశ్రయులు అయ్యారు.
- మొత్తం 75,097 పశువులు భారీ వర్షాల వల్ల వచ్చిన వరదలకు కొట్టుకుపోయి చనిపోయాయి.
సచివాలయంలో ఫొటో ఎగ్జిబిషన్ సందర్శన : వరద నష్టాన్ని పరిశీలించడానికి కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి కర్నల్ కేపీ సింగ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం బుధవారం రాష్ట్రానికి వచ్చింది. ముందుగా సచివాలయంలో ఏర్పాటు చేసిన వరద నష్టంపై ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించగా, ఆ తర్వాత వివిధ శాఖల ఉన్నతాధికారులు, సీఎస్‌తో సమావేశమయ్యారు. ఆ కేంద్ర బృందానికి రాష్ట్ర విపత్తు నివారణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌తో పాటు మిగిలిన శాఖల ఉన్నతాధికారులు నష్ట వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
అతి తక్కువ సమయంలో చర్యలు తీసుకున్నాం : అతి తక్కువ సమయంలో వేగంగా చర్యలు తీసుకోవడంతోనే ప్రాణ నష్టం తగ్గింది. ముఖ్యంగా వాతావరణ శాఖకు స్పెషల్ థ్యాంక్స్. సీఎం, ఉపముఖ్యమంత్రి, మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి వరద ప్రభావాన్ని, సహాయక చర్యలను పర్యవేక్షించారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగంగా చేయడానికి అవసరమైన నిధులను ఉదారంగా అందించండి. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఎన్డీఆర్ఎఫ్తో సమానంగా రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక బృందాలకు శిక్షణ, ఇతర సదుపాయాలు కల్పించడానికి ఎన్డీఎంఏ ద్వారా సాయం అందించాలి. అని సీఎస్ శాంతి కుమారి అన్నారు.
332 హెక్టార్ల విస్తీర్ణంలోని చెట్లు ఎలా కూలాయి : కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వరద ప్రభావంపై వివరిస్తున్న సందర్భంలో రాష్ట్ర విపత్తు నివారణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. ఏటూరు నాగారం అడవిలో 332 హెక్టార్ల విస్తీర్ణంలో చెట్లు కూలాయని ప్రస్తావించారు. అలాగే అక్కడ జరిగిన పర్యావరణ విపత్తును వివరించారు. దీనిపై కేంద్రబృందం స్పందిస్తూ ఆ చెట్లు ఎలా కూలాయని, చెట్లు కూలడానికి మూలకారణం తెలుసుకునేందుకు సమగ్ర అధ్యయనం చేయాలని రాష్ట్ర అధికారులకు సూచించారు.
నిండా ముంచిన మున్నేరు - సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ ప్రజలు - Floods in Telangana 2024
Mahabubabad Floods : వర్షాలు తగ్గినా వదలని ముప్పు.. రైతుల ఆందోళన