Telangana Govt Providing New Current Meter in Low Price : రాష్ట్రంలో రూ. 938కే కొత్త విద్యుత్తు మీటరు. రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల కిందటే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాష్ట్రంలోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు కొత్తగా విద్యుత్తు సర్వీసు(మీటరు) రూ.938కే ఇవ్వనుంది. వాస్తవానికి ఈ పథకం గడువు నెల కిందే ముగిసింది. కానీ ఇంకా చాలామంది కొత్త మీటరు కనెక్షన్లు పొందాల్సి ఉండటంతో ప్రభుత్వం ఈ నెల 30 వరకు గడువును పొడిగించింది.
ప్రస్తుతం ఉన్న భవనంపై మరో అంతస్తు నిర్మించుకున్నా.. అదనంగా మరో విద్యుత్ మీటరు కావాలంటే ఇది వరకు బీపీఎల్ వారు రూ.1,518 చెల్లించేవారు. కానీ పేదలకు ఇది భారం అవుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ధరను తగ్గించింది. కొత్త విద్యుత్తు సర్వీసు కావాల్సిన వారు స్థానిక మీ సేవలో రేషన్ కార్డు, ఆధార్, ఇంటి పత్రాల జిరాక్స్‌లు, రెండు పీపీ ఫొటోలతో సూచించిన రుసుము రూ.938 చెల్లించాలి. వెంటనే మీటరు మంజూరు చేసి సిబ్బంది ఇంటికి వచ్చి కొత్త విద్యుత్తు సర్వీసును బిగిస్తారు.
క్షేత్రస్థాయిలో అవగాహన లేకపోవడంతో : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ఆయా జిల్లాలు సరిగ్గా ఉపయోగించుకోలేదు. సంబంధిత అధికారులు సైతం దీనిపై ప్రచారం చేయకపోవడంతో ఎవరూ దరఖాస్తు చేసుకోలేకపోయారు. నిజామాబాద్ జిల్లాలో మాత్రం కేవలం రెండు నెలల్లో 550 కొత్త సర్వీసులు పొందారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఈ పథకంపై అవగాహన కల్పించి ఉంటే చాలామంది ముందుకొచ్చేవారు.
ఈ పథకాన్ని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ రవీందర్ సూచించారు. ఈ నెల 30 వరకు గడువు ఉందని, స్థానికంగా ఉన్న మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. అన్ని పత్రాలు సరిగ్గా ఉంటే వెంటనే మీటరు మంజూరు చేసి సిబ్బంది ఇంటికి వచ్చి మీటరును బిగ్గిస్తారని చెప్పారు. సిబ్బంది ఎవరైనా అదనంగా డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలని సూచించారు.