Telangana Govt On LRS Applications : రాష్ట్రంలో కొంతకాలంగా పెండింగులో ఉన్న అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) చిక్కుముడులు విప్పేందుకు అధికారులు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇటు హైకోర్టులో, అటు సుప్రీంకోర్టులో వీటిపై వ్యాజ్యాలుండడంతో నాలుగేళ్లుగా ఈ వ్యవహారం అపరిష్కృతంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిష్కరించి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలనేది ప్రభుత్వ ఆలోచన.
Officials Preparing Report On LRS : అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తెస్తామని ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క గతంలో పలు సమీక్షల సందర్భంగా చెప్పారు. పురపాలక వ్యవహారాలపై ముఖ్యమంత్రి త్వరలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారని, అప్పటికి ఎల్‌ఆర్‌ఎస్ చిక్కులపై సీఎంకు నివేదిక అందించాలని అధికారులు సిద్ధమవుతున్నారు.
ఎల్‌ఆర్‌ఎస్‌పై ఎత్తి వేసేందుకు : ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో స్టే ఉంది. సుప్రీంకోర్టులో కూడా వ్యాజ్యం దాఖలైనప్పటికీ అది ఇంతవరకు అడ్మిట్ కాలేదని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు స్టే ఎత్తివేత కోసం అఫిడవిట్ దాఖలుకు సీఎం నుంచి అనుమతి కోరాలని నిర్ణయించారు. హైకోర్టులోనే పరిష్కారాన్ని పొందటం ద్వారా లక్షల మంది దరఖాస్తుదారులకు వెసులుబాటు కల్పించినట్లవుతుందని ఓ అధికారి పేర్కొన్నారు.
25లక్షల మంది దరఖాస్తుదారుల నిరీక్షణ : క్రమబద్ధీకరణ కోసం 2020 నుంచి 25.44 లక్షల మంది దరఖాస్తుదారులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్లాట్ల యజమానుల్లో కొందరు ఇళ్ల నిర్మాణాన్ని కూడా చేపట్టారు. మరికొంత మంది హైకోర్టు ఉత్తర్వుల మేరకు భవన నిర్మాణ అనుమతుల కోసం ఫీజు రూపంలో అదనపు రుసుము చెల్లించి ఇళ్లు నిర్మించుకున్నారు.
ఏళ్ల కిందట స్థలాలు కొనుక్కున్న వారు ఇప్పుడు వాటిని కుటుంబ అవసరాల రీత్యా విక్రయించుకోవాలనుకుంటున్నారు. క్రమబద్ధీకరణ కాకుండా స్థలాలు విక్రయిస్తే వాటికి రిజిస్ట్రేషన్లు అయ్యే పరిస్థితి లేకపోవటంతో కొనుగోలుదారులు ముందుకు రావటం లేదని, వచ్చినా తక్కువ మొత్తానికి అడుగుతున్నారని పలువురు దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ఖజానాకు ఆదాయం చేకూరే అవకాశం : గత డిసెంబరులో కొలువుదీరిన రేవంత్ సర్కారు ఈ ఏడాది మార్చి నెలలోనే ఎల్‌ఆర్‌ఎస్ దస్త్రాల పరిష్కారానికి ఉపక్రమించింది. దరఖాస్తుదారులకు స్థానిక అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. తర్వాత సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావటంతో ప్రక్రియ ఆగింది. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని త్వరగా పరిష్కరించుకుంటే రాష్ట్ర ఖజానాకు కొంత ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.