TG Govt Focus On Irrigation Projects : కొద్దిపాటి మిగిలిన పనులను పూర్తిచేయడంతో పాటు తక్కువ వ్యయం అవసరమయ్యే ప్రాజెక్టులను ఈ ఏడాది పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 75 శాతానికి పైగా పనులు పూర్తైన19 ప్రాజెక్టులను ప్రాధాన్యకరంగా ఎంచుకొంది. ఆయా ప్రాజెక్టులవారీగా సీఈలు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. మిగిలిన పనులు, ఉన్న సమస్యలు, అధిగమించాల్సిన అంశాలు, అవసరమయ్యే నిధులతో కూడిన సమగ్ర నివేదిక సిద్ధంచేశారు.
Minister Uttam Review On Irrigation Projects : ఉన్నతాధికారులు, చీఫ్ ఇంజనీర్లతో సమావేశమైన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రాధాన్యకర ప్రాజెక్టులపై సమీక్షించారు. ఆయా ప్రాజెక్టుల కింద మిగిలిన, పూర్తి చేయాల్సిన పనులపై చర్చించారు. వీలైనంత త్వరగా పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించాలని అధికారులు, ఇంజనీర్లను ఆదేశించారు.
19 ప్రాధాన్యకర ప్రాజెక్టుల పనులు పూర్తిచేస్తే కొత్త ఆయకట్టుతోపాటు స్థిరీకరణ ఆయకట్టు కలిపి ఆరు లక్షలా 80 వేలకు పైగా ఎకరాలు ఉంటుందని అంచనా వేశారు. దేవాదుల, సీతారామ, కల్వకుర్తి, ఏఎమ్ఆర్, ఎస్ఎల్‌బీసీ, డిండి, శ్రీపాదఎల్లంపల్లి, నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల, చనాకా - కొరాటా, చిన్న కాళేశ్వరం, ఎస్సారెస్పీ రెండోదశ, పిప్రి ఎత్తిపోతల, కోయిల్ సాగర్, మోడికుంటవాగు, నీల్వాయి ప్రాజెక్టుగట్టు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలు ఈ ఏడాది ప్రాధాన్యకర ప్రాజెక్టుల జాబితాలో ఉన్నాయి.
Projects To Be Completed On Priority : ప్రాధాన్యతా క్రమంలోని పనులు త్వరగా పూర్తిచేసి వాటి ద్వారా సాగునీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 18వేల 600 ఎకరాలకు నీరు అందించే సదర్‌మట్ ఆనకట్ట మరమ్మత్తు పనులు దాదాపుగా పూర్తి కావోచ్చింది. మిగిలిన పని త్వరగా పూర్తి చేసి నెలాఖరులో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని భావిస్తున్నారు. సీతారామసాగర్ ప్రాజెక్టులో భాగంగా రాజీవ్ కాలువ పనులను పూర్తిచేసి ఆగష్టు 15న ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నారు. తద్వారా లక్షా 25వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని భావిస్తున్నారు.
CM Mahbubnagar Tour : నేడు మహబూబ్‌నగర్ జిల్లాకు వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు. అంతకుముందే నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, సీఈలతో మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు సమావేశమై సంబంధిత అంశాలపై చర్చించారు.
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పనులను ఫాస్ట్ ట్రాక్‌లో కొనసాగించడం సహా మిగిలిన ప్రాజెక్టుల పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. లక్ష ఎకరాలకు నీరు అందించేలా ప్రతిపాదించిన నారాయణపేట్ - కొడంగల్ ఎత్తిపోతల పథకానికి టెండర్ల ప్రతిపాదనలు సిద్ధంచేశారు. టెండర్ల ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. సీఎం సమీక్షలో ఆ విషయమై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.