Demolition of Musi Encroachments : ఆదివారం నుంచి మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణలను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.మొదటి విడతగా నది గర్భంలోని ఆక్రమణలను తొలగించనున్నారు. వీటిని తొలగించేందుకు హైడ్రాకు బాధ్యతలు అప్పగించారు. సుమారు 12 వేల ఆక్రమణలున్నట్లు గుర్తించిన ప్రభుత్వం, 55 కిలో మీటర్ల మేర మూసీ నదిని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది.
శనివారం ఉదయం మలక్‌పేట నియోజకవర్గంలోని పిల్లి గుడిసెలలోని డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. మూసీ పరివాహక ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ మూసీ సుందరీకరణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని ఆయన తెలిపారు.
పెండింగ్ నిర్మాణాలపై ఆరా : మూసీ ప్రాంతాన్ని పర్యాటక , పారిశ్రామిక, ఉపాధి అవకాశాలు పెంచే విధంగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని కొత్త ఇన్నోవేటేడ్ కార్యక్రమంగా తీసుకుని ముందుకు వెళ్తుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన, పునః నిర్మాణాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్‌రూం ఇంటి నిర్మాణాలు ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం చంచల్‌గూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనాన్ని పరిశీలించారు. భవనం పూర్తయినప్పటికీ ఇంకా వసతి సౌకర్యాలు కల్పించలేదని మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి ఈ క్రమంలో విద్యార్థులతోనూ మాట్లాడుతూ సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి , మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ ,జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి చేదు అనుభవం : మరోవైపు మలక్పేట్ నియోజకవర్గంలోని పిల్లి గుడిసెలు ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లను సందర్శిస్తున్న సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌కి చేదు అనుభవం ఎదురయ్యింది. డబుల్ బెడ్ రూమ్‌ఇళ్లు రాని స్థానికులు మంత్రి పొన్నం ప్రభాకర్ వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. తమకు ఇళ్లను కేటాయించి న్యాయం చేయ్యాలంటూ డిమాండ్ చేశారు. తమ సమస్యలను విన్నవించినప్పటికీ మంత్రి పట్టించుకోకుండా వెళ్లారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.