Government Schools Uniform Tender To Karimnagar Women : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసే ఏకరూప దుస్తుల తయారీ బాధ్యతలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్వశక్తి సంఘాల మహిళలకు అప్పగించారు. వచ్చే విద్యాసంవత్సరం ఆరంభం రోజే వీటిని పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని దాదాపు ఒక లక్ష 80వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. దీనికిగాను ప్రభుత్వం రూ.1.80 కోట్లు మంజూరు చేసింది. ఏకరూప దుస్తులు కుట్టే ప్రక్రియను వేసవి సెలవుల్లోనే పూర్తి చేసేలా విధి విధానాలు రూపొందించి నిధులు మంజూరు చేశారు.
ఫిర్యాదులు దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు : గతంలో మండల స్థాయిలో ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించడంతో కుట్టడం ఆలస్యమయ్యేది. దుస్తుల కొలతలు కూడా సరిగ్గా లేక పొడుగు, పొట్టి సైజుల్లో ఉన్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఒక లక్ష 80వేల 737 మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున 3 లక్షల 61వేల 474 దుస్తులు సిద్దమవుతున్నాయి.
"మాకు ఇక్కడ టీమ్ సెంటర్ ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చారు. ముందు యూనిఫామ్ కుట్టడం నేర్పించారు. ఇప్పుడు యూనిఫామ్ కుట్టే ఆర్డర్ మాకు అప్పజెప్పారు. ఒక్క జత యూనిఫామ్‌కు రూ.50 ఇస్తున్నారు. అంతా పోనూ మాకు రూ.30 మిగులుతుంది. కాకపోతే డబ్బులు ఇంకొంత పెంచి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ప్రభుత్వం కూడా ఆలోచించి మంచి రేటు ఇస్తే, మాకు లాభదాయకంగా ఉంటుంది." - మహిళలు
Self Help Groups Fishing on Terrace : మిద్దెపై చేపల పెంపకం.. సంపాదనలో వావ్ అనిపిస్తున్న మహిళలు
బాలికల్లో 1-3 తరగతుల వారికి ఒక డిజైన్‌తో, 4, 5 తరగతుల వారికి చొక్కా, స్కర్ట్, 6-12 తరగతుల విద్యార్థినులకు పంజాబీ డ్రెస్ కుట్టాల్సి ఉంటుంది. ఇక బాలురకు 1 నుంచి 12వ తరగతుల వారికి చొక్కా, నిక్కర్, ప్యాంట్ కుడతారు. గతంలో చాలా చోట్ల సైజ్‌లో తేడాలతో పొడుగు, పొట్టిగా మారగా, ఈసారి అలా కాకుండా ఆయా జిల్లా కలెక్టర్లు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు, కుట్టు పనికి అవసరమైన వస్త్రం టెస్కో పంపిణీ చేయగా, పాఠశాల ప్రారంభం రోజున ఒక విద్యార్థికి ఒక జత అందించడానికి విద్యాశాఖ ప్రణాళికలు రూపొందించింది. ప్రభుత్వం తమకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది కాబట్టి తాము కూడా ప్రభుత్వానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని వారు చెబుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆయా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తొలుత మొదటి యూనిఫామ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దీనితో నాణ్యతలోనూ ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్లు స్పష్టం చేశారు.
Women Empowerment Through SERP : స్వయం సహాయక బృందాల సాయంతో.. 'మిలియనీర్లుగా మహిళలు'