Telangana Government Focus on Crop Insurance : రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం కానుక అందించబోతోంది. త్వరలో కొత్త వ్యవసాయ పంట బీమా పథకం అమల్లోకి రానుంది. ఖరీఫ్ సీజన్ నుంచి ఉచిత పంట బీమా పథకం అమల్లోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఆ దిశగా విస్తృత కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులు విధివిధానాల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరడం, ప్రీమియం చెల్లింపులు, బీమా పరిహారం వంటి అంశాలపై అధ్యయనం చేస్తున్నారు.
పొరుగు రాష్ట్రాల్లో పంట బీమా పథకం ఎలా అమలవుతోందని పరిశీలిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన బీమా కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా ఉందని, రైతులకు ఉపయోగకరంగా లేదని గత ప్రభుత్వం మూడేళ్ల క్రితం దాన్ని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో విపత్తులు సంభవిస్తే అన్నదాతలు నష్టపోతున్నందున ఖరీఫ్ సీజన్ నుంచి కొత్త బీమా పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికి ఏటా రూ.3వేల కోట్ల వ్యయం కావచ్చని అంచనా.
Crop insurance scheme in Telangana : నూతనంగా అమలు చేయనున్న పంటల బీమా పథకంలో రైతులు నయా పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే వ్యవసాయ పంటలకు ప్రీమియం చెల్లిస్తుంది. ఇది ఈ పథకం ప్రత్యేకత. ప్రకృతి విపత్తులతో పంటలు నష్టపోతే బీమా కంపెనీల నుంచి పరిహారం వచ్చేలా ప్రభుత్వం నిక్కచ్చి చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా కోటిన్నర ఎకరాల విస్తీర్ణం వ్యవసాయ భూమి ఉంది. ఇందులో మొత్తం సాగవటం లేదు. 2021-22 ఖరీఫ్ సీజన్‌లో 1,30 కోట్ల ఎకరాలు, 2022-23లో 1.36 కోట్ల ఎకరాలు, 2023-24లో 1.26 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ పంటలు సాగయ్యాయి. ఈ లెక్కన వచ్చే ఖరీఫ్‌లోనూ 1.30 నుంచి 1.35 కోట్ల ఎకరాలు పైగా పంటల బీమా ప్రీమియం నేరుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఐతే రైతులు, రైతు సంఘాలతో విస్తృతంగా చర్చించిన మీదట అన్నదాతకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో నిర్థారణకొచ్చాకే విధానం రూపొందించాలని నిపుణులు అన్నారు.
New Agricultural Crop Insurance Scheme : పంటల కొత్త బీమా పథకం అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు బీమా కంపెనీలతో ఒప్పందాలు, ప్రీమియం నిర్ధారణకు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ ద్వారా చేపట్టే క్రాప్ బుకింగ్ యాప్‌లో నమోదైతే చాలు ఆ పంటలకు బీమా వర్తిస్తుంది. సుమారు 1.35 కోట్ల ఎకరాల నుంచి 1.45 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వానా కాలం పంటలు సాగయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మొత్తం విస్తీర్ణానికి పంటల బీమా పథకం అమలు చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం మెరుగ్గా అమలు చేసేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా అధికారులు సదస్సులు నిర్వహిస్తున్నారు. ఏఈఓల స్థాయి నుంచి ఏఓఏలు, ఏడీఏలు, డీఏఓలు, సీపీఓలు, ఇతర అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ సదస్సులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని అన్నదాతల పక్షాన స్వాగతిస్తున్నామని రైతు సంఘాలు నేతలు తెలిపారు.
ఒకవైపు అకాల వర్షాలు, వడగళ్లు పడడం, మరోవైపు కరవు రావడం ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఎలాంటి పరిహారం అందక నష్టపోతున్నారు. ప్రభుత్వాలు హామీ ఇస్తున్నాయి కాని ఆచరణలోకి వచ్చే సరికి చాలా సమయం పడుతోంది. దీనివల్ల రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. అందుకే పంటల భీమా సమగ్రంగా ఉండాలి. - తీగల సాగర్, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం
Telangana Crop Bhema : ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ క్రాప్ బుకింగ్ పోర్టల్‌ను పకడ్బందీగా అమలు చేస్తోంది. మండలాలను క్లస్టర్లుగా విభజించి ఏఈఓలతో క్రాప్ బుకింగ్ పక్రియను పక్కాగా చేయిస్తున్నారు. అది ఏ సర్వే నంబరు? ఆ క్షేత్రంలో ఏ పంట వేశారు? పట్టాదారు పాస్ పుస్తకం వివరాలు, రైతుల పేర్లు ఇతర వివరాలు నమోదు చేస్తున్నారు. వానా కాలం, యాసంగి సీజన్లు ప్రారంభమైన మొదటి రోజు నుంచి పంటల సాగు ముగిసే చివరి రోజు వరకు క్రాప్ బుకింగ్ చేయడం పరిపాటి. ప్రతి ఏఈఓ తన దగ్గర ఉన్న ట్యాబ్‌లో పంటల సాగు వివరాలు నమోదు చేస్తున్నారు.
REVANTH REDDY: 'రైతులకు కావాల్సింది రైతు బీమా కాదు.. పంట బీమా'
రైతుల నుంచి అభిప్రాయాలు స్వీకరణ : ఉచిత పంటల బీమా పథకాన్ని అమలుస చేయటానికి క్రాప్ బుకింగ్ పోర్టల్‌లో నమోదైన విస్తీర్ణాన్నే పరిగణనలోకి తీసుకోవాలని ఇప్పటికే వ్యవసాయ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే ఏ పంటలు వేశారో నిర్ధారించుకోవటానికి మాత్రం రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకుంటే మేలు అనే అభిప్రాయానికి వచ్చింది. ఇది గందరగోళానికి తావివ్వకుండా వాస్తవ పంట నష్టం లెక్కించేందుకు ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టం సంభవించినప్పుడు క్షేత్రస్థాయిలో పత్తి పంట నష్టపోతే పోర్టల్‌లో మొక్కజొన్న పంట నమోదు చేసి ఉంటే సమస్యలు వస్తాయి.
రైతులకు పరిహారం చెల్లించేలా పథకం : స్వయంగా పంట క్షేత్రానికి వెళ్లి అక్షాంశాలు, రేఖాంశాలు పరిగణనలోకి తీసుకుని క్రాప్ బుకింగ్ చేయనున్న దృష్ట్యా ఆయా అంశాలపై సమగ్రంగా చర్చించిన తర్వాతే విధివిధానాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. పంట పంటకు వ్యత్యాసం ఉంటుంది. ప్రతి జానెడు భూమిలో కూడా దెబ్బతిన్న పైర్లకు శాస్త్రీయబద్ధంగా రైతులకు పరిహారం చెల్లించేలా ఈ పథకం ఉండాలని రైతు సంఘాలు సూచించాయి. కొత్త పథకం ఎంతో మెరుగ్గా ఉండనుందని వివరించారు. త్వరలో జరగబోయే శాసనసభ సమావేశాల్లో చట్టం ప్రవేశపెట్టి అమలు చేస్తామని వెల్లడించారు.