Telangana Govt on Land Prices Revision : తెలంగాణలో నవంబరు నుంచి భూముల కొత్త మార్కెట్ విలువ అమల్లోకి రానుంది. రాష్ట్రంలో ఉన్న భూముల బహిరంగ ధరలను స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అధ్యయనం చేసింది. ఈ మేరకు భూముల మార్కెట్ విలువను సవరించే ప్రక్రియను దాదాపు పూర్తిచేసింది. ఈ సందర్భంగా త్వరలోనే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నివేదిక అందించనుంది. అనంతరం కొత్త మార్కెట్ విలువను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమల్లోకి తీసుకురానుంది. ప్రస్తుతానికి అయితే రాష్ట్రంలో అమలవుతున్న ధరలు దాదాపు కొనసాగే అవకాశాలున్నట్లు సమాచారం.
హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో మార్కెట్ విలువ కంటే బహిరంగ ధరలు అధికంగా ఉన్నచోట్ల కొంత పెంపుదల ఉండే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో బహిరంగ ధరల కంటే మార్కెట్ విలువ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. దీని ప్రకారం ఈ జిల్లాల్లో ధరలు తగ్గించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న 7.5 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలను కొంత తగ్గించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
వచ్చే నెలలో కొత్త రెవెన్యూ చట్టం : కొత్త రెవెన్యూ చట్టం (ఆర్‌ఓఆర్)-2024ను అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు గురువారం దీనికి సంబంధించి ధరణి కమిటీ సభ్యులు సునీల్‌కుమార్, కోదండరెడ్డి తదితరులతో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిత్తల్ సమావేశమయ్యారు. ధరణి కమిటీ నివేదిక ప్రకారం కొత్త చట్టంలో అనేక అంశాలను జోడించిన రాష్ట్ర ప్రభుత్వం, ధరణి పోర్టల్‌లోనూ మార్పులకు చర్యలు చేపట్టింది. రెవెన్యూ శాఖ ఆర్‌ఓఆర్ చట్టంపై గత నెలలో సలహాలు సూచనలు తీసుకోగా వాటిని క్రోడీకరించి కొత్త చట్టంలోని చేర్చేందుకు ఏర్పాట్లు చేసింది. వచ్చే నెలలో ఈ ప్రక్రియను పూర్తి చేసి కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.