New Thermal Power Plant under Singareni and Genco : రామగుండంలో సూపర్ క్రిటికల్ పరిజ్ఞానంతో కొత్తగా థర్మల్ విద్యుత్ ప్లాంటును సింగరేణి, జెన్‌కోల సంయుక్త భాగస్వామ్యంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన విధి విధానాలను సింగరేణితో కలసి వారంలోగా రూపొందించాలని జెన్‌కోకు రాష్ట్ర ఇంధనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను నెలలోపు తయారు చేయాలని జెన్‌కోను ప్రభుత్వం ఆదేశించింది.
ప్రస్తుతం రామగుండంలో జెన్‌కోకు 62.5 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంటు ఉంది. ఈ థర్మల్ విద్యుత్ ప్లాంట్ కాలం చెల్లడంతో ఉత్పత్తిని నిలిపివేసింది. అక్కడి ఉద్యోగులను సైతం ఖాళీగా ఉంచి జెన్‌కో వారికి జీతాలు చెల్లిస్తోంది. దీని స్థానంలోనే కొత్తగా థర్మల్ విద్యుత్ ప్లాంటు నిర్మించి తమను అక్కడే కొనసాగించాలని వారు ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ కొత్తగా థర్మల్ విద్యుత్ ప్లాంటును నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ఈ క్రమంలో దీనిపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం కార్యాలయం ఆదేశాలిచ్చినట్లు తాజాగా రాష్ట్ర ఇంధనశాఖ జెన్‌కోకు ఇచ్చిన ఉత్తర్వుల్లో తెలిపింది.
ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరించేది లేదు : సింగరేణి, జెన్‌కో సంయుక్త భాగస్వామ్యంలో కొత్తగా థర్మల్ విద్యుత్ ప్లాంటును నిర్మించాలని తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఇంజినీర్ల సంఘం పేర్కొంది. దీన్ని జెన్కోనే సొంతంగా నిర్మించాలని కోరుతూ ఆదివారం జరగిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసినట్లు అధ్యక్ష, కార్యదర్శులు రత్నాకర్‌రావు, సదానందం మీడియాకు తెలిపారు.
మరోవైపు పునర్విభజన చట్టం ప్రకారం ఎన్టీపీసీలో కొత్తగా నిర్మించాల్సిన 800 మెగా వాట్ల మూడు యూనిట్లను కూడా ప్రభుత్వం కొనసాగించనున్నట్లు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ ఇటీవలె మీడియాకు తెలిపారు. ఆ క్రమంలోనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు గత నెలలో రామగుండంలో పర్యటించి స్థలాలను పరిశీలించారు.