Holiday For Schools In Telangana : వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు సోమవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అలాగే అన్ని ప్రభుత్వ విభాగాలకు సెలవులు రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది.
మంత్రి పొంగులేటి హెచ్చరిక : రేపు సాయంత్రం వరకు భారీ వర్షాలు ఉన్నాయని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి సహాయక చర్యలు చేపడుతున్నారని ఆయన తెలిపారు. భారీ వర్షాలు ఉన్నందున రేపు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. పలుచోట్ల రహదారులపై భారీగా వరద ప్రవహిస్తోందని, వరద ఉన్నచోట ఎవరూ రోడ్డు దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు.
అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరూ బయటకి రావొద్దని మంత్రి పొంగులేటి వెల్లడించారు. జలవనరులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాలేరు జలాశయానికి భారీగా వరద వస్తోందని, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. హైదరాబాదు పురాతన గోడలలో ఉండే ప్రజలను షెల్టర్లకు షిఫ్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువులు నిండే దాకా చూడకుండా, వాటర్‌ను విడుదల చేయాలని అధికారులకు సూచించామని తెలిపారు. యువత సెల్ఫీ కోసం నీరు ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లిప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని సూచించారు.
హైదరాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, విద్యుత్, ఆర్ అండ్ బీ శాఖలతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా నిరంతరం విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే హైదరాబాద్ కలెక్టరేట్లోని కంట్రోల్ రూం 040-23202813, 9063423979 నెంబరుతో పాటు ఆర్డీవో హైదరాబాద్ 7416818610, 9985117660, సికింద్రాబాద్ ఆర్డీవో ఫోన్ నెంబర్ 8019747481లకు ఫోన్ చేసి సమస్యలు తెలపాలని సూచించారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ - SCR Cancelled Trains