Telangana Formation Day Celebrations Schedule : తెలంగాణ రాష్ట్ర అవతరణ పదేళ్ల పండగ సంబరాలకు సర్వం సిద్ధమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న రాష్ట్ర అవతరణ వేడుకలకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లను చేసింది. ఇప్పుడు ఆ వేడుకలు ఆంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఉదయం పరేడ్ గ్రౌండ్స్‌లో ఉత్సవాలు, సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై సంబరాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర అధికార గీతాన్ని నేడు ప్రభుత్వం జాతికి అంకితం చేయనుంది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది.
తెలంగాణ ఆవిర్భావ వేడుకల షెడ్యూల్ :
- ఉదయం 9 గంటల 15 నిమిషాలకు గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద అమరులకు ముఖ్యమంత్రి నివాళి అర్పించనున్నారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకుంటారు.
- ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను సీఎం ఆవిష్కరించడంతో పరేడ్ మైదానంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం సీఎం గౌరవ వందనం స్వీకరిస్తారు. సుమారు 12 నిమిషాల పాటు ఓపెన్ టాప్ జీపులో ముఖ్యమంత్రి పరేడ్‌ను పర్యవేక్షిస్తారు. 20 నిమిషాల పాటు మార్చ్ పాస్ట్ ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర అధికార గీతం జయ జయహే తెలంగాణ రెండున్నర నిమిషాల నిడివి గీతాన్ని ఆవిష్కరిస్తారు.
- ఆ తర్వాత ఐదు నిమిషాలు సోనియా గాంధీ ప్రసంగించాల్సి ఉంది. అయితే ఆరోగ్య కారణాల వల్ల సోనియా గాంధీ వచ్చే అవకాశం లేదని వీడియో సందేశం పంపిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
- అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు 25 నిమిషాలు ప్రసంగిస్తారు. రాష్ట్ర చరిత్ర, సాంస్కృతిక పునరుజ్జీవనానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత పోలీసు సిబ్బందికి, ఉత్తమ శకటాలకు అవార్డులు ప్రదానం చేసి ఫోటోలు దిగుతారు.
- ఉదయం 11.30 గంటలకు పరేడ్ ముగించడంతో పరేడ్ గ్రౌండ్స్‌లో ఉత్సవాలు ముగుస్తాయి.
సాయంత్రం ట్యాంక్ బండ్‌పై ఉత్సవాలు : సాయంత్రం ట్యాంక్ బండ్‌పై ఉత్సవాలు జరుగుతాయి. తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, ఫుడ్ స్టాల్స్ 80 ఏర్పాటు చేశారు. సాయంత్రం 6.50 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్‌బండ్‌కు చేరుకొని అక్కడి స్టాళ్లను సందర్శిస్తారు. రాత్రి 7 గంటల నుంచి సుమారు 700 మంది కళాకారులతో తెలంగాణ కళారూపాల కార్నివాల్ నిర్వహిస్తారు. అనంతరం 7.20 గంటల నుంచి 70 నిమిషాల పాటు సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు ఉంటాయి.
రాత్రి 8.30 గంటలకు సుమారు 5వేల మంది జాతీయ జెండాలతో ట్యాంక్‌బండ్‌పై భారీ ఫ్లాగ్‌వాక్ నిర్వహిస్తారు. అది జరగుతుండగా 13.30 నిమిషాల జయ జయహే తెలంగాణ పూర్తి నిడివి గీతాన్ని విడుదల చేస్తారు. కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణిని సన్మానిస్తారు. రాత్రి 8.50 గంటల నుంచి పది నిమిషాల పాటు హుస్సేన్ సాగరం మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా బాణాసంచా కార్యక్రమం నిర్వహిస్తారు. రాత్రి 9 గంటలకు ట్యాంక్‌బండ్‌పై వేడుకలు ముగుస్తాయి.
పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు : గవర్నర్ రాధాకృష్ణన్, మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానించింది. పరేడ్ గ్రౌండ్స్‌లో అతిథులకు, సాధారణ ప్రజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రెండు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా తెలంగాణ దినోత్సవాలు జరగనున్నాయి. కలెక్టరేట్లు, పంచాయతీ, ఎంపీపీ, జెడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్, ఎమ్మెల్యే కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు జెండా ఆవిష్కరించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, చారిత్ర కట్టడాలు, ముఖ్య కట్టడాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
ఆహ్వానించినట్లే ఆహ్వానించి అవమానించదలిచారు - కేసీఆర్ బహిరంగ లేఖ - KCR letters to CM Revanth
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ రావట్లేదు : వీహెచ్ - Sonia Not Come to TG celebrations