Special Focus on Elephant Group in Telangana : రాష్ట్రంలో ఏనుగుల మందను ఎదుర్కొనేందుకు అటవీ శాఖ సన్నద్ధమైంది. గత కొన్ని రోజుల కిందట మహారాష్ట్రలో సంచరిస్తున్న ఏనుగుల మందలో నుంచి ఓ ఏనుగు తప్పిపోయి తెలంగాణలో ప్రవేశించింది. అటవీ అధికారులు ఎంతో శ్రమించి ఆ ఏనుగును తిరిగి మహారాష్ట్ర అడవుల్లోకి పంపించారు. తాజాగా తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులో ఏనుగుల మంద సంచరిస్తుందన్న సమాచారంతో తెలంగాణ అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఒకవేళ ఏనుగుల మంద వస్తే ఆ సంక్షోభాన్ని ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలి అన్న అంశంపై హైదరాబాద్ శివారు దూలపల్లి అటవీ అకాడమీలో అన్ని జిల్లాల ముఖ్య అటవీ శాఖ అధికారుల రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి అటవీ శాఖ సంరక్షణ ప్రధానాధికారి పీసీసీఎఫ్ ఆర్‌ఎం డోబ్రియాల్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్) ఎంసీ ఫర్గయిన్, పీసీసీఎఫ్ (ప్రొటెక్షన్ & విజిలెన్స్) డైరెక్టర్ ఈలుసింగ్, పీసీసీఎఫ్ (కంపా) డాక్టర్ సువర్ణ, అదనపు పీసీసీఎఫ్ సునీతా భగవత్, ఇతర జిల్లాల అటవీ శాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
ఏనుగుల కదలికలపై నిఘా : ఏనుగుల మంద తిరిగి తెలంగాణలోకి ప్రవేశిస్తే జరిగే సంక్షోభం నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా చర్చించారు. సరిహద్దు గ్రామ ప్రజలు, రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా సరిహద్దులకు దగ్గరలో ఉన్న గ్రామ ప్రజలు, అవాసాలకు ఎలాంటి హానీ చేయక ముందే ఎలా తిరిగి వెనక్కి పంపాలన్న అంశంపై జిల్లాల అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించవద్దని కోరారు. సరిహద్దు జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏనుగుల కదలికలపై అధునాతన సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని డోబ్రియాల్ సూచించారు.
గత నెలలో ఒంటరిగా వచ్చి : గత నెలలో మహారాష్ట్రలో ఏనుగుల మందలో నుంచి ఓ ఏనుగు తప్పిపోయి తెలంగాణలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కలకలం సృష్టించి కేవలం 14 గంటల వ్యవధిలోనే ఇద్దరు వ్యక్తులను బలితీసుకుంది. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు చర్యలు చేపట్టి మహారాష్ట్రలోని దాని స్థావరానికి తిరిగి పంపించేశారు. అయితే అప్పుడు వచ్చిన ఏనుగు ఇప్పుడు గుంపును తీసుకొచ్చిందన్న సమాచారంతో రాష్ట అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఒకవేళ ఆ ఏనుగుల మంద గ్రామాల్లోకి వస్తే మళ్లీ జరిగే విధ్వంసం తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దాని తీవ్రతను నియంత్రించేందుకు అధికారులు విస్తృతంగా చర్చించారు. పరిసర ప్రాంతాల ప్రజలు క్షేమంగా ఉండేలా, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలనే దానిపై అటవీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించనున్నారు.