Telangana DSC Notification 2024 : తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు విడుదల చేయనున్నారు. వాటిలో స్కూల్ అసిస్టెంట్ 2629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులున్నాయి. దరఖాస్తుల గడువు నియమ నిబంధనలను వెల్లడించనున్నారు.
TS DSC 2024 Notification : మే లేదా జూన్‌లో 10 రోజుల పాటు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. కొత్త నోటిఫికేషన్‌కు నిర్ణయించిన ప్రభుత్వం, గతేడాది సెప్టెంబరు 6న 5089 పోస్టులతో జారీ చేసిన డీఎస్సీ (TS DSC 2024) ప్రకటన రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్రంగా మరో కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని అందులో పేర్కొంది. పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని, నూతన డీఎస్సీకి వాటిని పరిగణనలోనికి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు. పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ప్రతి పంచాయతీకి ఒక ప్రభుత్వ పాఠశాల ఉందా - వివరాల సేకరణపై విద్యాశాఖ కసరత్తు
అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని గతంలో కాంగ్రెస్ ప్రకటించింది. అందుకు అనుగుణంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి కొత్త ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఉండేలా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రతి బడికి ఉపాధ్యాయుడు ఉండాలనే సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాలకు అనుగుణంగా విద్యాశాఖ గత మూడు వారాలుగా కసరత్తు చేసి నోటిఫికేషన్ సిద్ధం చేసింది.
TS Mega DSC Notification 2024 : గతేడాది విడుదల చేసిన నోటిఫికేషన్‌కు 1,77,502 మంది దరఖాస్తు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో అది జరగలేదు. సర్కార్ మారినందున మరిన్ని పోస్టులను కలిపి నోటిఫికేషన్ ఇచ్చేందుకు పాత ప్రకటనను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. నాటి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్ తయారు చేశారు. పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రశ్నాపత్రాలు మొదలు, ఫలితాల వరకు సాంకేతికతను వినియోగించేలా విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. పరీక్షను ఎంసెట్ తరహాలో నిర్వహించనున్నారని తెలుస్తోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చేందుకు వీలుగా పెద్ద ఎత్తున బడిబాట కార్యక్రమాలు చేపట్టాలని సర్కార్ నిర్ణయించింది. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో వెలువరించనున్నారు. డీఎస్సీతో ఉపాధ్యాయుల కొరత తీరనున్నందున, విద్యార్థులను పెద్ద ఎత్తున చేర్చడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కళకళలాడుతాయని సర్కారు భావిస్తోంది. జాతీయ సగటు మేరకు ప్రతి 17 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి.
Telangana TRT Notification 2024 : అందుకే ఉపాధ్యాయుల దామాషాకు అనుగుణంగా విద్యార్థులను పెంచేలా తెలంగాణ సర్కార్ దిశానిర్దేశనం చేయనుంది. పాఠశాలలకు ఏ వసతులు కావాలనే అంశంపై విద్యాశాఖ సమాచారం సేకరించి ప్రభుత్వానికి పంపింది. పాఠశాలల్లో సమస్యలు, ఇతర అంశాలపై నేడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించాల్సిన సమీక్ష వాయిదా పడింది. రేపు లేదా మరో రోజు జరిగే సమీక్షలో మౌలిక వసతులపై సీఎం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష - టీఎస్పీఎస్సీ ప్రకటన
గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదల- దరఖాస్తులు ఎప్పటినుంచంటే?