Telangana Cyber Security Bureau Refund RS 31 Crore to Victims : సైబర్ నేరగాళ్ల దాడుల్లో ఒకసారి వారి చేతుల్లోకి వెళ్లిన సొమ్ము తిరిగి బాధితుని వద్దకు రావడమంటే ఏదో అద్భుతమే జరగాలి. ఇలా చాలా మంది అనేక రకాల సైబర్ దాడుల్లో కోట్ల రూపాయల సొమ్మునే పోగొట్టుకున్నారు. సైబర్ దొంగలు చేస్తున్న ఈ ఘరానా మోసాలను ఒక్కోసారి పోలీసులు కూడా కనుక్కోలేకపోతున్నారు. ఇలా సైబర్ మోసాలు బాధితులు ఈ ఆధునిక సమాజంలో రోజురోజుకీ పెరిగిపోతున్నారు. అనునిత్యం రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర సైబర్ దాడి జరుగుతుంది. ముఖ్యంగా టెక్నాలజీ పెరిగిన తర్వాత సైబర్ బాబులు బాగా రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లు ఇలాంటి వారిని గుర్తించడం కఠినంగానే ఉండేది కానీ వారితో పాటు పోలీసులు కూడా కొత్త పంథాలను ఎంచుకోవడంతో ఇలాంటి దాడులకు పాల్పడేవారిని గుర్తించి వారి నుంచి సొమ్మును దాదాపుగా రికవరీ చేస్తున్నారు.
ముఖ్యంగా సైబర్ నేరాల్లో బాధితుల నుంచి నేరగాళ్లు కాజేసిన సొమ్మును తిరిగి తీసుకొచ్చేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా గత మూడు నెలల వ్యవధిలో తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీతో కలిసి పోగొట్టుకున్న బాధితుల సొమ్ము రూ.31.29 కోట్లు తిరిగి వారికి ఇచ్చినట్లు బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. దీంతోపాటు సైబర్ నేరాలకు సంబంధించి దీర్ఘకాలంగా బ్యాంకుల వద్ద నిలిచిపోయిన బాధితుల సొమ్మును లోక్ ఆదాలత్ ద్వారా కూడా వారికి ఇప్పించినట్లు తెలిపారు.
సైబర్ నేరాల్లో బాధితులు పోగొట్టుకున్న సొమ్మును వారి ఫిర్యాదు ద్వారా ఫ్రీజ్ చేసిన తర్వాత వాటిని 457 సెక్షన్ కింద దర్యాప్తు అధికారి కోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే కోర్టుల అనుమతితో వాటిని బాధితులకు తిరిగి ఇచ్చే అవకాశం ఉందన్నారు. కేవలం హైదరాబాద్లోనే కాకుండా జిల్లాల్లో కూడా దీనిపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇలా ఇప్పటివరకు 5142 పిటిషన్లకు సంబంధించిన రూ.31.29 కోట్లను బాధితులకు తిరిగి ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇలా పోలీసులు, న్యాయ వ్యవస్థ కలిసి ఆర్థిక సైబర్ నేరాల్లో బాధితులకు న్యాయం చేకూరే అవకాశం ఉందని శిఖా గోయల్ వెల్లడించారు. ఉదాహరణకు హైదరాబాద్లో సైబర్ దాడికి పాల్పడిన ఓ మహిళ సొత్తును హైదరాబాద్ పోలీసులు ఎంతో చాకచక్యంగా పట్టుకుని ఆమెకు ఆ సొమ్మును అందించారు. ఇలా చాలా దాడుల నుంచి డబ్బును పోలీసులు రికవరీ చేశారు.