Telangana Congress Lok Sabha Tickets Fight : రాష్ట్రంలో జరిగే లోక్‌సభ ఎన్నికల(Loksabha 2024) బరిలో తమ కుటుంబ సభ్యులను బరిలోకి దించడానికి పలువురు మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా మెదక్ కోసం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం కోసం ఎమ్మెల్యే వివేక్ కుమారుడు వంశీకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మరోవైపు నల్గొండ, ఖమ్మం, మిర్యాలగూడ లోక్‌సభ స్థానాల్లోనూ ఈ పోటీ ఎక్కువగా ఉంది. కుటుంబ సభ్యులకు టికెట్లు ఇచ్చే విషయంలో పార్టీ అంత సానుకూలంగా లేకున్నా ఎవరి ప్రయత్నాలను వారు చేస్తున్నారు.
ఇప్పటికే ఖమ్మం జిల్లా నుంచి మంత్రివర్గంలో ముగ్గురు ముఖ్య నాయకులు ఉండగా వారు తమ కుటుంబ సభ్యులను బరిలోకి నిలిపేందుకు పట్టుదలతో ఉన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భార్య నందిని భారీ ర్యాలీగా వచ్చి లోక్‌సభ(Khammam Lok Sabha Seat) టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అలాగే మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్ సైతం ఈ టికెట్ కోసం పోటీపడుతున్నారు. ఇంత పోటీ ఎందుకంటే ఇక్కడి నుంచి పోటీలో ముందుంటారని భావించిన రేణుకాచౌదరిని రాజ్యసభకు పంపడంతో వీరి ముగ్గురు తమ ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. మరోవైపు పారిశ్రామికవేత్త రాజేంద్రప్రసాద్ కూడా ఖమ్మం లోక్‌సభ స్థానం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే అధిష్ఠానం మాత్రం ఈ పార్లమెంటు సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొనే అవకాశం ఉందని సమాచారం.
Lok Sabha Congress Seats : నల్గొండ స్థానానికి కూడా తీవ్రమైన పోటీనే ఉంది. ముఖ్యంగా మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి ఇప్పటికే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమార్తె శ్రీనిధిరెడ్డి, సోదరుడి కుమారుడు చంద్రపవన్రెడ్డి కూడా టికెట్ ఆశిస్తుండగా, మాజీ మంత్రి ఆర్. దామోదర్‌రెడ్డి కుమారుడు సరోత్తమరెడ్డి కూడా దరఖాస్తు చేశారు. అయితే ఇప్పటికే పార్టీ అధిష్ఠానం అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట టికెట్ ఇవ్వలేకపోయిన పటేల్ రమేశ్‌రెడ్డికి ఈ టికెట్ ఇస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చింది. భువనగిరి నుంచి మునుగోడు(Munugodu) ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి టికెట్‌ను కోరుతున్నారు. ఇలా ఈ మూడు స్థానాలకు పోటీ గట్టిగానే ఉంది.
గులాబీ ఖాతా ఖాళీ చేసేందుకు 'ఆపరేషన్ చేవెళ్ల' - కాంగ్రెస్ వ్యూహం మామూలుగా లేదుగా?
సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం కోసం కొత్త అభ్యర్థుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ వినిపించిన మొదటి పేరు అనికుమార్ యాదవ్‌ను అనూహ్యంగా రాజ్యసభకు పంపించారు. అందుకే ఈ స్థానంలో మున్నూరు కాపు, ముదిరాజ్ వర్గాలకు చెందిన నాయకులను నిలబెట్టే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ(GHMC) మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు మొదటిగా వినిపిస్తోంది. ఈ టికెట్ కోసం విద్యా స్రవంతి ప్రయత్నాలు చేస్తున్నారు. మెదక్ నుంచి మైనంపల్లి హనుమంతరావు, నీలం మధు ముదిరాజ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల, కుమార్తె జయారెడ్డి పోటీకి ఆసక్తి చూపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్న సమాచారం.
కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా : చేవెళ్ల నుంచి ఇటీవలే కాంగ్రెస్(Congress)లో చేరిన వికారాబాద్ జడ్పీ ఛైర్మన్ పట్నం సునీతారెడ్డి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్‌కు అవకాశం ఇస్తారనే ప్రచారం సాగుతుండగా, అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి టికెట్ కోసం ప్రయత్నించిన విజయబాయి కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్‌లో వంశీచంద్ రెడ్డి పేరు దాదాపు ఖరారు అయినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే నాగర్ కర్నూల్ కోసం మల్లు రవి, సంపత్ కుమార్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పోటీకి సిద్ధమవుతుండగా, మరో స్థానం కరీంనగర్ నుంచి ఆయన పేరు వినిపిస్తోంది. ఆదిలాబాద్ నుంచి వైద్యురాలితో పాటు మరికొందరి పేర్లు పరిశీలనలో ఉండగా, మల్కాజిగిరి అభ్యర్థి ఎంపికలో మాత్రం అధిష్ఠానం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు పార్టీ వర్గాలు వస్తున్న సమాచారం.
2024 లోక్‌సభ ఎన్నికల తేదీలు ఫిక్స్! మార్చి 9 తర్వాత షెడ్యూల్!
'లోక్‌సభ ఎన్నికల్లో మాకు 10 సీట్లు ఖాయం - బీసీలను గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం'