Telangana Congress in-Charges Collections : పార్టీ కార్యకలాపాలు పర్యవేక్షణ చేసేందుకు జాతీయ పార్టీలు రాష్ట్రాలకు ఇంఛార్జ్‌లను, ఇంఛార్జ్ కార్యదర్శులను నియమిస్తాయి. వీరు ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలకు వారధిగా పని చేస్తారు. అదేవిధంగా రాష్ట్రాలలో నాయకులను సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయడం వీరి ప్రధాన లక్ష్యంగా చెప్పొచ్చు. కానీ కాంగ్రెస్(Congress) అధిష్ఠానం తెలంగాణ రాష్ట్రానికి పంపుతున్న ఇంచార్జ్‌లు, ఇంచార్జ్ కార్యదర్శుల్లో నిష్పక్షపాతంగా పని చేస్తున్న నాయకులు కొరవడుతున్నారు.
కొందరు దీపం ఉండగానే ఇంటిని చక్కపెట్టుకునే కార్యక్రమాన్ని గుట్టుగా కానిచ్చేస్తున్నారు. అందినకాడికి దండుకుంటూ పార్టీ నియమావళిని తుంగలో తొక్కుతున్నారు. నాయకుల మధ్య విభేదాలను సమసిపోయేట్లు చేసి పార్టీని బలోపేతం చేయాల్సిన ఇంచార్జ్‌లు అందుకు భిన్నంగా నడుచుకుంటున్నారు. నిస్వార్థంగా పార్టీకి సేవలు అందించాల్సిన ఇంచార్జ్ల్లో కొందరు స్వార్థమే పరమావధిగా భావిస్తున్నారు. పార్టీ ప్రయోజనాలకు గండి కొడుతున్నారు. ఎక్కువ భాగం ఇంచార్జ్‌లు విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎవ్వరు ఇంఛార్జ్‌లుగా వచ్చినా ఎక్కువ రోజులు పనిచేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏడాది ఏడాదిన్నర లోపే విమర్శలు, ఆరోపణలతో ఇంఛార్జ్‌లు తట్టాబుట్ట సర్దుకోవాల్సి వస్తోందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.
Telangana Congress in-Charges Issue : 2018లో అసెంబ్లీ , 2019లో పార్లమెంట్ ఎన్నికలు తర్వాత అప్పటి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఆర్సీ కుంతియా బదిలీ అయ్యారు. అయన స్థానంలో మాణిక్కం ఠాగూర్ వచ్చారు. ఈయన రాష్ట్ర ఇంఛార్జ్‌గా వచ్చినప్పుడు కొన్ని రోజులు బాగానే ఉన్నా ఆ తర్వాత ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. ప్రత్యర్థి వర్గం అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడమే కాకుండా ఆయనను మార్చాలని పట్టుబట్టింది. దాదాపు 14 నెలలు తర్వాత తలొగ్గిన అధిష్ఠానం మాణిక్కం ఠాగూర్ స్థానంలో మాణిక్ రావు ఠాక్రే(Manik Rao Thackeray)ని నియమించారు.
కొన్ని రోజుల తర్వాత ఠాక్రే కూడా ఒక వర్గానికి దగ్గరవ్వడం మరొక వర్గానికి దూరం కావడం జరిగింది. ఏఐసీసీ ఇంఛార్జ్ కార్యదర్శులు ముగ్గురు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి నాయకుల మధ్య అంతరాలను తగ్గించి క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చెయ్యాల్సి ఉన్న వారు హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. ఠాక్రే కూడా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసిన తర్వాత వాటిని రద్దు చేసుకుని ప్రోటోకాల్ వెహికల్ బదులు ప్రైవేట్ వెహికల్లో రోడ్ మార్గాన మహారాష్ట్ర వెళ్లడం, పీసీసీ అధ్యక్షుడికి ఎరుక లేకుండా ఇతర పార్టీల నాయకులను కలవడం, పీసీసీ అధ్యక్షుడికి తెలియకుండా మండల కమిటీలు వెయ్యడం లాంటివి పార్టీలో ఇబ్బందికర పరిస్థితులకు దారితీసింది.
పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ గురి - బరిలో దిగేందుకు ఆశావహలు రెడీ
అందుకే మాణిక్ రావు ఠాక్రేను మార్చారు : రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ వ్యవహార శైలి వల్ల పార్టీకి లాభం కంటే నష్టం కలిగించేవిగా పరిస్థితులు మారడంతో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధిష్ఠానం అప్రమత్తమైంది. అసెంబ్లీ టిక్కెట్ల(Assembly Tickets) వ్యవహారంలోనూ గందరగోళం నెలకొంది. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టి టిక్కెట్లు రాని నాయకులను బుజ్జగించేందుకు సీనియర్ నేత జానారెడ్డి నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. దానితోపాటు ప్రత్యేక పరిశీలకులను నియమించి పరిస్థితులు మరింత చేజారకుండా జాగ్రత్త పడి దిద్దుబాటు చర్యలు తీసుకోవడం వల్ల పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ముందు చోటు చేసుకున్న పరిస్థితులను అంచనా వేసిన అధిష్ఠానం లోక్ సభ ఎన్నికల ముందే ఠాక్రేని తొలగించింది. ఆయన స్థానంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రత్యేక పరిశీలకురాలిగా వచ్చిన దీపాదాస్ మున్షిని కేరళ, లక్షద్వీప్‌లకు ఇంఛార్జ్‌గా నియమించిన ఏఐసీసీ తెలంగాణకు అదనపు బాధ్యతలు ఇచ్చారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలను(Lok sabha 2024) రాష్ట్ర నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీపాదాస్ మున్షి తెలంగాణ ఇంఛార్జిగా వచ్చినప్పటి నుంచి రాష్ట్ర నాయకత్వంతో సఖ్యత లేదన్న భావన పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. కొందరు నాయకులతో సన్నిహితంగా ఇంకొందరితో అంటీముట్టనట్లు ఉంటున్నారనే భావన పార్టీలో వ్యక్తం అవుతోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ ఏఐసీసీ కార్యదర్శులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం లేదన్న వాదన కూడా వినిపిస్తుంది. పార్టీ కార్యక్రమాల గురించి సమాచారం ఇవ్వకపోగా వాళ్లను పార్టీ ఇంచార్జీలుగా కూడా చూడకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
Telangana Lok Sabha Election 2024 : తాజ్ కృష్ణ 5 స్టార్ హోటల్లో ఉంటున్న ఆమె ఈ నెల 14వ తేదీన వస్తున్నట్లు ప్రోటోకాల్ వాళ్లకు సమాచారం ఇచ్చారు. కానీ ఆమె 12వ తేదీ రాత్రికి హైదరాబాద్ రాగా 13వ తేదీ రాత్రి వరకు ప్రోటోకాల్ విభాగానికి సమాచారం లేదు. దీనికి తోడు ఆమెకు అందుబాటులో ఉండి సహాయం చేసేందుకు నాగపూర్, కర్ణాటకలకు చెందిన ముగ్గురిని అందుబాటులో ఉంటున్నారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రోటోకాల్ సిబ్బందినే అందుబాటులో ఉండి సహకారం అందిస్తారు. కానీ బయట రాష్ట్రాల వాళ్లను ఈ రాష్ట్ర పార్టీ కార్యక్రమాలలో భాగస్వామ్యం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతటితో ఆగకుండా ఆ ముగ్గురిని రాష్ట్ర స్థాయి కమిటీలో నియమించడం విమర్శలకు దారి తీస్తోంది.
ప్రొటోకాల్ వెహికల్ బదులు స్థానిక వెహికల్లో వెళుతున్నారు : ప్రొటోకాల్ వెహికల్ బదులు స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన ప్రైవేట్ వాహనం వాడుకుంటున్నారు. ఆమె కదలికలు తెలియకుండా ఉండేందుకు గన్మెన్లను, స్థానిక ప్రొటోకాల్ సిబ్బందిని పక్కన పెట్టి బయటకి వెళుతుంటారని తెలుస్తోంది. తాజాగా ఆమె బెంజ్ కార్ లబ్ధి పొందినట్లు వస్తున్న ఆరోపణలను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఖండిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో రాష్ట్ర నాయకులను సమన్వయం చేసేందుకు కలిసికట్టుగా ముందుకు వెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌లతో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు నియమిస్తుంది. వీరు పీసీసీ(PCC) అధ్యక్షుడితోపాటు కార్యవర్గంతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా పార్టీ అధిష్ఠానం జోక్యం చేసుకుని రాష్ట్ర నాయకులను ఒకతాటిపైకి తీసుకొచ్చి సమర్థవంతంగా పని చేసేటట్లు చేయగలిగితేనే రాష్ట్ర నాయకత్వం లక్ష్యం మేరకు 14లోక్‌సభ స్థానాలు చేజిక్కించుకోవచ్చన్న అభిప్రాయం పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్‌లో ఎంపీ టికెట్ల పంచాయితీ - కుటుంబీకులకు ఇప్పించేందుకు ముఖ్యనేతల విశ్వ ప్రయత్నాలు!
పార్లమెంట్ ఎన్నికల్లో విజయకేతనమే లక్ష్యం - రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల 'హస్త'గతం దిశగా కసరత్తులు