CM Revanth Reddy US Tour Schedule 2024 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో విదేశీ పర్యటన ఖరారైంది. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఈ ఏడాది జనవరిలో స్విట్జర్లాండ్, లండన్, దుబాయ్ దేశాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన అమెరికా పర్యటన ఖరారైనట్లు సీఎంవో కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 3వ తేదీన రాత్రి అమెరికా బయల్దేరనున్నట్లు ఈ ప్రకటనలో పేర్కొంది.
రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన సాగనున్నట్లు తెలిసింది. అగ్రరాజ్యంలోని డల్లాస్ వంటి రాష్ట్రాల్లో ఈ బృందం పర్యటించనుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ అగ్రరాజ్యంలోని పలు కంపెనీల సీఈవోలు, పారిశ్రామికవేత్తలను కలవనున్నారు. వారితో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారు.
Revanth Reddy Team Visits America in August 2024 : ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న పలు కంపెనీల గురించి వారికి చెప్పి, ఇన్వెస్ట్‌మెంట్‌కు తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం ఎంతటి భద్రమైన, అనువైన ప్రాంతమో వివరించనున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణకు మరిన్ని పెట్టుబడులను ఆహ్వానించి పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. దాదాపుగా ఎనిమిది రోజుల పాటు అగ్రరాజ్యంలో పర్యటించనున్న రేవంత్ రెడ్డి బృందం తిరిగి ఆగస్టు 11వ తేదీన హైదరాబాద్‌కు చేరుకోనుంది. ఈ పర్యటనలో గతం కంటే ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించాలని సీఎం టీమ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
ఇక ఈ ఏడాది జనవరి నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్జి స్విట్జర్లాండ్, లండన్, దుబాయ్ వంటి దేశాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక ద్వారా భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చారు. దాదాపు రూ.40వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఈ పర్యటనల్లో ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా మూసీ పునరుజ్జీవం, అభివృద్ధి కోసం లండన్‌లో థేమ్స్ నది అభివృద్ధిపై అధ్యయనం చేశారు.