Telangana CM Revanth Reddy Meets PM Modi in Delhi Today : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం భేటీ అయ్యారు. సీఎం వెంట ప్రధాని మోదీ వద్దకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా వెళ్లారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, విభజన హామీలపై చర్చించారు. ప్రధాని మోదీతో భేటీకి ముందు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి సైతం పాల్గొన్నారు.
ప్రధానితో భేటీ అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, 'రాష్ట్ర సమస్యలపై కేంద్రమంత్రులను కలిశాం. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ప్రధానికి వినతి పత్రం ఇచ్చాం. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజలు విరక్తి చెందారు. ఆ పార్టీపై విరక్తితో 'ఇండియా' కూటమికి ప్రజలు ఓట్లేశారు. ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది' అని వ్యాఖ్యానించారు.
ఆ 5 గ్రామాలను తెలంగాణలో తిరిగి కలపాలని కోరాం : రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. గోదావరి పరిసరాల్లోని బొగ్గు గనులను వేలం లేకుండా సింగరేణికి కేటాయించాలని ప్రధానిని కోరామని తెలిపారు. రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వాలని, ఐటీఆర్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని విన్నవించినట్లు చెప్పారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేయాలని, తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు వివరించారు.
జిల్లాకొక నవోదయ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరామన్న భట్టి, విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని మోదీని కోరామన్నారు. ఈ క్రమంలోనే విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోం శాఖ చొరవ తీసుకోవాలని కోరామన్న ఆయన, భద్రాచలం సమీపంలోని 5 గ్రామాలను తెలంగాణలో తిరిగి కలపాలని కోరామన్నారు. తమ వినతులకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా సానుకూలంగా స్పందించారన్న ఉప ముఖ్యమంత్రి, వారిద్దరికి కృతజ్ఞతలు తెలిపారు.