Telangana Auto Drivers Financial Assistance : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో భాగంగా ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి చర్చిస్తున్నారు. రెండో రోజు సమావేశాల్లో శాసనసభలో ఆటో డ్రైవర్ల సమస్యపై వాడివేడిగా చర్చ జరుగుతోంది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడాన్ని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సమర్థిస్తూనే, దానివల్ల ఆటో డ్రైవర్లకు నష్టం కలుగుతోందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. రాష్ట్ర సర్కార్ ఆటో కార్మికుల కష్టాలను పట్టించుకోవడం లేదని ఆరోపించింది.
Financial Assistance To Telangana Auto Drivers : ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తమ ప్రభుత్వం అన్ని వర్గాల వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం తమ బాధ్యత అని చెప్పారు. వారికి ఏటా రూ.12 వేలు సాయం చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. బడ్జెట్‌లో వారి కోసం ప్రత్యేకంగా కేటాయింపులు జరుపుతామని వెల్లడించారు.
'రాష్ట్ర ఆర్థిక ప్రగతి విషయంలో ఎలాంటి భేషజాలు లేవు. అభివృద్ధి అనేది నిత్యం కొనసాగుతుంది. అందరికీ అవకాశం ఇవ్వాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశం. ఒకరిద్దరికే అవకాశం ఇవ్వవద్దని రాహుల్ గాంధీ చెప్పారు. పెట్టుబడుదారులను రాష్ట్రానికి స్వాగతిస్తాం. క్రానీ క్యాపిటల్‌ను ప్రోత్సహించే ఆలోచనే మాకు లేదు. రాష్ట్ర అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వండి తీసుకుంటాం. రాజకీయాలు వదిలి రాష్ట్ర ప్రగతి గురించి మాట్లాడదాం' అని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
ఆ విషయంలో సీఎం క్షమాపణలు చెప్పాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీల పట్టు - మండలిలో గందరగోళం
క్రానీ క్యాపిటల్‌ను ప్రోత్సహించం : అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందని, పదేళ్లలో 17 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. క్రానీ క్యాపిటల్ వద్దని రాహుల్ గాంధీ చెప్పారని, అదానీ ఇక్కడకు వస్తే తెలంగాణ ఆర్థిక ప్రగతి ఆగిపోతుందని అన్నారని గుర్తు చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ కంపెనీని తీసుకువచ్చే యోచనలో ఉందని పల్లా అనడంతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి జోక్యం చేసుకుని క్రానీ క్యాపిటల్‌ను ప్రోత్సహించే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. అభివృద్ధికి సంబంధించిన సలహాలు ప్రతిపక్షాల నుంచి తప్పక తీసుకుంటామని స్పష్టం చేశారు.
"రాష్ట్ర ప్రగతి విషయంలో మేం ప్రతిపక్షం సలహాలు కూడా వింటాం. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలసీలు ప్రజలకు మేలు చేస్తాయి అనుకుంటే మేం వాటిని కొనసాగిస్తాం. ఎప్పటికైనా ప్రజాసంక్షేమమే మా లక్ష్యం. ఇప్పుడే మా ప్రయాణం మొదలుపెట్టాం. ఇంకా చాలా పాలసీలు, నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో మీరు కూడా సలహాలు, సూచనలు ఇవ్వండి. అవి ప్రజలకు మేలు చేస్తాయనుకుంటే తప్పకుండా స్వీకరిస్తాం. రాజకీయాలు మాట్లాడుకునేందుకు మనకు చాలా వేదికలున్నాయి. ఇక్కడ మాత్రం రాష్ట్ర ప్రగతి గురించి చర్చిద్దాం." - శ్రీధర్ బాబు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి
అసెంబ్లీకి రాని ప్రతిపక్షనాయకుడు మనకు అవసరమా? - కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతల ఫైర్
LIVE UPDATES : సీఎంను మార్చేందుకు మాకు ఎవరి అనుమతీ అక్కర్లేదు: పోచారం