Telangana Assembly Sessions 2024 : రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు 4 రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈనెల 9, 10, 12, 13వ తేదీల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఫిబ్రవరి 9వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సభలో చర్చించనున్నారు. 10వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 12, 13న బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చ జరగనుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధించుకున్న తర్వాత తొలిసారి కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మొట్టమొదటి బడ్జెట్ ఇది.
అయితే బీఏసీ సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు, హరీశ్‌రావు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ భేటీకి ఇవాళ కేసీఆర్ స్థానంలో హరీశ్ రావు హాజరయ్యారు. బీఏసీ జాబితాలో పేర్లు ఉన్న వారే భేటీకీ రావాలని మంత్రి శ్రీధర్‌బాబు అనగా, సభాపతి అనుమతి ఇస్తేనే భేటీకి వచ్చానని హరీశ్‌రావు తెలిపారు. కొత్త సంప్రదాయం తగదని శ్రీధర్ బాబు అనడంతో గతంలోనూ వేరే వారు హాజరయ్యే సంప్రదాయం ఉందన్న హరీశ్ రావు, ఒకవేళ లేదని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఇరువురి మధ్య స్పీకర్ జోక్యం చేసుకుని బీఏసీ సమావేశాన్ని అర్థం చేసుకొని సహకరించాలని కోరడంతో హరీశ్ రావు భేటీ నుంచి బయటకు వచ్చారు.
Telangana Budget Sessions 2024 : మరోవైపు బడ్జెట్ సమావేశాలు నాలుగు రోజులే నిర్వహించడం పట్ల బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. సభ కనీసం 12 రోజులు నిర్వహించాలని కోరింది. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడుతున్నట్లు ప్రభుత్వం చెప్పిందని, సభను నాలుగు రోజులు కాకుండా కనీసం 12 రోజులు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. అవసరమైతే 13వ తేదీన మరోసారి బీఏసీ నిర్వహిస్తామని చెప్పారని కడియం శ్రీహరి వెల్లడించారు.
ప్రజాకాంక్షలు నెరవేరేలా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోంది : గవర్నర్ తమిళిసై
"త్వరగా బడ్జెట్ ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజా సమస్యలు ప్రస్తావించే అవకాశం లేకుండా పోతుంది. హామీలపై నిలదీస్తారనే త్వరగా ముగించాలని చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రొటోకాల్ వివాదం ఏర్పడుతోంది. కాంగ్రెస్ అభ్యర్థులు ఓడినా వారే మాకు ఎమ్మెల్యేలే అని సీఎం చెప్పారు. సీఎం ప్రకటనతో అధికారులు రెచ్చిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఇది శాంతి భద్రతల సమస్యలకు దారి తీస్తుంది. ముందు ప్రొటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూస్తామని సభాపతి, సీఎం హామీ ఇచ్చారు. గ్యారంటీలు, హామీలపై నిలదీస్తారనే నాలుగే రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీలో అవకాశం రాకపోయినా ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఉద్యమాలు నిర్మిస్తాం." - కడియం శ్రీహరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
మరోవైపు ఇవాళ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలిరోజైన నేడు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. కాళోజీ కవితతో ప్రసంగం మొదలుపెట్టిన తమిళిసై, తమిళ కవి సుబ్రమణ్య భారతి మాటలతో ముగించారు. రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వ కొలువుదీరిందని అన్నారు. ఈ సర్కార్ ప్రజాకాంక్షలు నెరవేరేలా పనిచేస్తుందని తెలిపారు. త్వరలోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తుందని వెల్లడించారు.
ఈ బడ్జెట్లో బీసీ సంక్షేమానికి రూ. 20వేల కోట్లు కేటాయించాలి - భట్టి విక్రమార్కకు కవిత లేఖ