Telangana Assembly Sessions 2024 Ended : కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరాక జరిగిన రెండో అసెంబ్లీ సమావేశాలు అర్థవంతంగా సాగాయని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. రెండు కీలక తీర్మానాలతో పాటు చాలా అంశాలపై ప్రజలకు స్పష్టత ఇచ్చామని పేర్కొన్నారు. బాధ్యతగల ప్రతిపక్ష నాయకుడు సభకు రాకపోవడం విడ్డూరమన్న మంత్రి నల్గొండ సభలో రాజకీయాలు చేశారంటూ ఆక్షేపించారు. మేడిగడ్డ కుంగినందుకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు.
గత ప్రభుత్వం దోపిడీ, కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం : రాజగోపాల్ రెడ్డి
Telangana Budget Sessions 2024 : శాసనసభ బడ్జెట్ (Assembly Sessions 2024) సమావేశాలు 45 గంటల 32 నిమిషాల పాటు సాగాయి. 64 మంది ఎమ్మెల్యేలు శూన్య గంటలో వివిధ అంశాలపై మాట్లాడే అవకాశం దక్కింది. రెండు తీర్మానాలు, మూడు బిల్లులు, ఒక అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. సమావేశాల్లో సుదీర్ఘంగా కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ కుంగుబాటు, గత ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలు, కృష్ణా జలాల వాటాలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, కులగణన తీర్మానం వంటి అంశాలపై సభలో సుదీర్ఘంగా చర్చించారు. మండలి 11 గంటల పాటు నడిచింది.
ప్రభుత్వంపై బురదజల్లడానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది తప్ప, బాధ్యత గల విపక్షంగా ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేయలేదని శ్రీధర్‌బాబు ఆక్షేపించారు. సభను తప్పుదోవ పట్టించేలా ప్రజలను గందరగోళ పరిచేలా ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా తీర్పును గౌరవించాలని విజ్ఞప్తి చేసిన ఆయన విభజన హామీలపై కలిసి పోరాటం చేసేందుకు కలిసి రావాలని శ్రీధర్‌బాబు కోరారు.
ముగిసిన తెలంగాణ శాసనసభ సమావేశాలు - నిరవధిక వాయిదా వేసిన స్పీకర్
"సభ మొత్తం 45 గంటల 32 నిమిషాల పాటు జరిగింది. 64 మంది ఎమ్మెల్యేలు జీరో అవర్‌లో మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 8 గంటల 43 నిమిషాలు మాట్లాడారు. బీఆర్ఎస్ శాసనసభ్యులు 8 గంటల 41 నిమిషాలు, సీపీఐ 2 గంటల పాటు మాట్లాడగా మూడు బిల్లులు, ఒక సబ్జెక్ట్‌పై షార్ట్ డిష్కర్షన్ జరిగింది. పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడేలా ఈ సభా సమావేశాలు జరిగాయి. ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపాలు తెలిసేలా శ్వేతపత్రం విడుదల చేశాం." -శ్రీధర్ బాబు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి
గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజలకు జరిగిన నష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించామని శ్రీధర్‌బాబు (Sridharbabu) తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలపై కేసీఆర్ స్పష్టత ఇస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. మేడిగడ్డ సందర్శనకు రాకుండా నల్గొండ సభకు వెళ్లి తమను దుర్భాషలాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో గులాబీ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. సభలో కేఆర్ఎంబీ పై ప్రభుత్వం మాట్లాడితే బీఆర్ఎస్ మాట్లాడకుండా పారిపోయిందని ఎద్దేవా చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై విడుదల చేసిన శ్వేత పత్రంలో ఏమైనా అనుమానాలు ఉంటే అన్నింటిని నివృత్తి చేస్తామని శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు.
శాసనసభలో నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం - వాడీవేడీగా సాగిన చర్చలు
గ్యారంటీలు అమలు చేసే పరిస్థితి లేక గారడీలు చేస్తున్నారు - కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ఫైర్