Telangana Assembly Adjourned on Tomorrow : ద్రవ్యవినిమయ బిల్లుపై మొదలైన శాసనసభ చర్చలు రసవత్తరంగా సాగాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారి తీశాయి. విపక్ష సభ్యుల ప్రశ్నలపై, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నేతల ఆందోళన నిరసన మధ్యే బిల్లుకు ఆమోదం తెలపగా, సభ రేపటికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
అంతకుముందు ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ వాడివేడిగా సాగింది. ఉద్యోగాలు, మూసీ సుందరీకరణపై మాజీమంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలకు దిగగా, మంత్రులు దీటుగా తిప్పికొట్టారు. రేవంత్ సర్కార్ కొత్తగా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని కేటీఆర్ ఆరోపించగా, పదేళ్లలో మీరేం చేశారంటూ అమాత్యులు బదులిచ్చారు. మూసీ సుందరీకరణపైనా మాటల యుద్ధం కొనసాగింది.
ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపిస్తే, వెంటనే రాజీనామా చేస్తా : ఎన్నికల హామీలను కాంగ్రెస్ సర్కార్ విస్మరిస్తోందని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం గ్యారంటీల పేరుతో, గారడీలు చేస్తోందన్న ఆయన హామీలు కొండంత, బడ్జెట్‌లో నిధులు గోరంత అని దుయ్యబట్టారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపిస్తే, వెంటనే తాను రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ చేశారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన మంత్రి సీతక్క, పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
మూసీ సుందరీకరణ విషయంలో ప్రభుత్వం అంచనాలు భారీగా పెంచిందని కేటీఆర్ విమర్శంచగా, డీపీఆర్ పూర్తి కాకుండానే తప్పుడు ఆరోపణలు ఎలా చేస్తారని మంత్రులు మండిపడ్డారు. ఎన్నికల హామీలను అమలు చేయాలన్న కేటీఆర్, బకాయిలను విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరిస్తే కలిసి వస్తామని పేర్కొన్నారు. అంతకుముందు కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, తమ మేనిఫెస్టోను కాపీ కొట్టే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని గట్టి కౌంటరిచ్చారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత గులాబీ పార్టీకి లేదని తిప్పికొట్టారు.
బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు సీఎం క్షమాపణ చెప్పాలి : హరీశ్‌రావు - Harish Rao Reaction on CM Comments