Teacher Suspicious Death : తరగతి గదిలో కొందరు విద్యార్థుల మధ్య వాగ్వాదం ఏర్పడింది. అనంతర పరిణామాలు ఆ ఉపాధ్యాయుడి ప్రాణాలు తీశాయి. అందరి ఎదుట మందలించడాన్ని జీర్ణించుకోలేకపోయిన కొందరు విద్యార్థులు దౌర్జన్యానికి దిగడం, ఆ తర్వాత ప్రక్రియలో ఆయన ప్రాణాలు కోల్పోవడం సంచలన వార్తగా నిలిచింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన ఉపాధ్యాయుడు ఏజాస్ అహ్మద్ (42) కొత్తపల్లిలోని ఉర్దూ ఉన్నత పాఠశాలలో సైన్స్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
పాఠశాలలో బుధవారం (డిసెంబర్ 4) తాను పాఠం చెబుతున్న తరగతి గదికి పక్కనున్న తొమ్మిదో తరగతి గదిలో విద్యార్థుల అల్లరి ఎక్కువగా వినిపించడంతో అక్కడికి వెళ్లారు. విద్యార్థులు ఘర్షణ పడుతున్నట్లు గుర్తించి మందలించారు. గొడవ పడుతున్న విద్యార్థులను విడిపించే క్రమంలో ఓ విద్యార్థిని గట్టిగా హెచ్చరించినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
కూర్చున్న కుర్చీలోనే : దీన్ని అవమానంగా భావించిన ఆ విద్యార్థి తన సన్నిహితులైన మరో ఇద్దరు విద్యార్థులు కలిసి ఉపాధ్యాయుడితో ఘర్షణకు దిగినట్లు చెబుతున్నారు. వెంటనే సహచర ఉపాధ్యాయులు అక్కడికి చేరుకుని ఏజాస్ అహ్మద్‌ను ప్రిన్సిపల్ గదిలోకి తీసుకెళ్లారు. తనకు అలసటగా ఉందని సహచరులతో చెప్పడంతో ఉపశమనం కోసం వారు ఇచ్చిన టాబ్లెట్ వేసుకున్నారు. అంతే కాసేపటికి కూర్చున్న కుర్చీలోనే కుప్పకూలారు.
వెంటనే ఉపాధ్యాయులు రాయచోటిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆ టీచర్ మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలిసుకున్న పోలీసులు వైద్యులతో చర్చించారు. గుండెపోటుతో చనిపోయారంటూ కుటుంబసభ్యులకు తెలిపారు. ఏజాస్ అహ్మద్ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాక ఉపాధ్యాయుడి భార్య రెహమూన్ (ఈమె రాయచోటిలోని బాలికల పాఠశాల టీచర్) తన భర్త మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేశారు.
విద్యార్థులపై ఆరోపణ : తన భర్త ఛాతీపై ముగ్గురు విద్యార్థులు బలంగా కొట్టడంతోనే చనిపోయారని సంచలన ఆరోపణలు చేశారు. మృతికి కారణమైన విద్యార్థులను ఉపాధ్యాయులు, పోలీసులు ఎందుకు కాపాడుతున్నారో అర్థం కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మృతి పట్ల అనుమానాలున్నాయని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
'పుష్ప' తీసిన ప్రాణం : సంధ్య థియేటర్‌కు అల్లుఅర్జున్ - తొక్కిసలాటలో మహిళ మృతి
డ్యూటీ ఫస్ట్ రోజే యువ IPS అధికారి మృతి- టైర్ పేలడమే కారణం- సీఎం సంతాపం