TDP Won Macherla Municipality in Palnadu District : మాచర్ల నియోజకవర్గంలో అరాచకాలు, దౌర్జన్యాలతో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెలరేగిపోయారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో పిన్నెల్లి సోదరుల కనుసైగల్లోనే నియోజకవర్గంలో అన్ని వ్యవహారాలు నడిచాయి. స్థానిక ఎన్నికల్లో విపక్ష పార్టీల నాయకులు నామినేషన్ వేయకుండా బెదిరించారు. పోలీసులతో కేసులు పెట్టించారు. అయినా కొందరు నామినేషన్లు వేయటానికి వెళ్తే దౌర్జన్యాలకు దిగి నామినేషన్ పత్రాలు లాక్కుని చింపించేశారు.
అంతే కాదు అభ్యర్థులపై దాడులకు తెగబడ్డారు. బెదిరించి నామినేషన్లు వెనక్కు తీసుకునేలా చేశారు. దీంతో మాచర్ల మున్సిపాలిటీతోపాటు 5 జడ్పీటీసీ (ZPTC) స్థానాలు, నియోజకవర్గంలోని అన్ని ఎంపీటీసీ (MPTC), సర్పంచ్ స్థానాలను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
మారుతున్న రాజకీయం : సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని గ్రహించిన పిన్నెల్లి ఎన్నికల రోజున, ఆ తర్వాత నియోజకవర్గంలో దాడులకు తెగబడ్డారు. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్ర వద్ద టీడీపీ ఏజెంట్‌పై నంబూరి శేషగిరిరావుపై దాడి, కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి కేసుల్లో పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుల్లో ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పరారీలో ఉన్నారు. దీంతో మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి దిక్కు లేకుండా పోయింది.
వైఎస్సార్సీపీకి షాక్ - టీడీపీలోకి మాచర్ల, హిందూపురం కౌన్సిలర్లు - YSRCP Leaders Joinings in TDP
టీడీపీలో చేరిన 16 మంది కౌన్సిలర్లు : ముఖ్యంగా మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో రాజకీయాలు వేగంగా మారిపోయాయి. పిన్నెల్లి ఏలుబడిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేకపోయిన కౌన్సిలర్లు అభివృద్ధి పనులు చేయకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని భావించారు. దీంతో డిప్యూటీ మున్సిపల్ ఛైర్మన్ నరసింహారావు సహా 16 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే జూలకంటి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఛైర్మన్ ఏసోబు వారం రోజుల క్రితం తన పదవికి రాజీనామా చేయటంతో ఎన్నిక అనివార్యమైంది. శుక్రవారం నిర్వహించిన ఛైర్మన్ ఎన్నికలో పోలూరి నరసింహారావు ఆ పదవిని దక్కించుకున్నారు. ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి సూచన మేరకు నరసింహారావును సభ్యులంతా ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. మాచర్ల అభివృద్ధికి అందరం కలిసి పనిచేస్తామని నూతన ఛైర్మన్ నరసింహారావు అన్నారు.
అజ్ఞాతంలో వైఎస్సార్సీపీ నాయకులు : వైఎస్సార్సీపీ తరపున గెలిచిన వారిలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురకా కిషోర్, మరికొందరు కౌన్సిలర్లు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. మిగతా వారు సైతం స్తబ్దుగా ఉండిపోవటంతో మాచర్ల మున్సిపాలిటీని టీడీపీ సులువుగా కైవసం చేసుకుంది. నియోజకవర్గంలో మిగతా ఎంపీపీ స్థానాలను సైతం కైవసం చేసుకోవటానికి టీడీపీ పావులు కదుపుతోంది.