TDP Priority for SC Candidates in First List: తెలుగుదేశం ప్రకటించిన తొలి జాబితాలో ఎస్సీలకు టిక్కెట్ల కేటాయింపులో సీనియర్లకు సముచిత స్థానం కల్పిస్తూనే విద్యావంతులు, పోరాట స్ఫూర్తి కలిగిన యువ నాయకులకు తగిన ప్రాధాన్యం ఇచ్చారు. ప్రకటించిన 20 మంది అభ్యర్థుల్లో 10 మంది తొలిసారి శాసనసభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన 11 మంది, మాల సామాజిక వర్గానికి చెందిన 9 మంది తొలి జాబితాలో ఉన్నారు. అధికార వైసీపీ ఎస్సీ వర్గానికి చెందిన మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్ని ఇష్టానుసారం మార్చేస్తూ, చాలా మందికి టికెట్‌లు ఇవ్వకుండా తీవ్ర గందరగోళ పరిస్థితులు సృష్టించింది.
తెలుగుదేశం మాత్రం చాలా చోట్ల గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి మళ్లీ అవకాశం ఇచ్చింది. శింగనమల నుంచి బండారు శ్రావణి, నందిగామ నుంచి తంగిరాల సౌమ్య గతంలో ఓడిపోయినా, మళ్లీ అవకాశం కల్పించారు. ఎస్సీ అభ్యర్థుల్లో ఒకరిద్దరు తప్ప అందరూ ఉన్నత విద్యా వంతులే. ముగ్గురు వైద్యులు , పీహెచ్‌డీ, ఎంబీఏ చేసిన వారు ఆరుగురు , బీటెక్, ఎంసీఏ చేసినవారు నలుగురు ఉన్నారు. ఎంఏ, ఎమ్మెస్సీ వంటి పీజీ కోర్సులు చదివినవారు ముగ్గురు, మిగతా వారంతా గ్రాడ్యుయేట్‌లు. తొలి జాబితాలో నలుగురు మహిళలకు అవకాశం లభించింది.
'వారసులొస్తున్నారు'- ఎన్నికల బరిలో గెలుపే లక్ష్యంగా ముందడుగు!
ఎస్సీ అభ్యర్థుల్లో 50 శాతం కొత్తవారికి తెలుగుదేశం అవకాశం ఇచ్చింది. వీరిలో పెద్దగా రాజకీయ నేపథ్యం లేనివారు, వివిధ రంగాల్లో స్థిరపడినవారు ఉన్నారు. యర్రగొండపాలెం అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులు. బీఈడీ చేసిన ఆయన 1995లో వెలిగండ్ల ఎంపీపీగా, 2001లో జెడ్పీటీసీ సభ్యుడిగా, 2006లో సర్పంచ్‌గా గెలిచారు. గత ప్రభుత్వంలో లిడ్‌క్యాప్ ఛైర్మన్‌గా పనిచేశారు. మూడేళ్ల కిందట యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమితులయ్యారు.
వైసీపీ దాష్టీకాలకు ఎదురొడ్డి స్థానికంగా పార్టీని సమర్థంగా నడిపించడంతో చంద్రబాబు ఆయనకే టికెట్ ఖరారు చేశారు. పార్వతీపురం నుంచి పోటీ చేస్తున్న బోనెల విజయచంద్ర బీటెక్ చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. రాజకీయ నేపథ్యం లేకపోయినా ఆయన చేస్తున్న సామాజిక కార్యక్రమాల్ని చూసి అవకాశం ఇచ్చారు. పి.గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సరిపెళ్ల రాజేష్ సామాజిక కార్యకర్త. మహాసేన రాజేష్‌గా పరిచితులు. దళితుల హక్కులపై పోరాడేందుకు ఓ సంస్థను స్థాపించారు.
వైసీపీ ప్రభుత్వ అరాచకాల్ని సామాజిక మాధ్యమాల్లో ఎండగడుతున్నారు. కొన్ని నెలల క్రితం టీడీపీలో చేరారు. ఆయనలోని నాయకత్వ లక్షణాల్ని గుర్తించి చంద్రబాబు టికెట్ ఇచ్చారు. చింతలపూడి అభ్యర్థి సొంగా రోషన్ ఎంసీఏ చేశారు. 18 ఏళ్లపాటు అమెరికాలో వివిధ కంపెనీల్లో పనిచేశారు. మిషన్ హోప్ పేరుతో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి సేవలందిస్తున్నారు. ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చారు.
టీడీపీ-జనసేన తొలిజాబితాలో యువ జోష్ - 45 ఏళ్లలోపు 24 మంది
తిరువూరు అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ చదివారు. 27 ఏళ్ల కిందట హైదరాబాద్‌లో కేఎస్‌రావు ఐఏఎస్ అకాడమీ స్థాపించారు. గీతం వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అమరావతి పరిరక్షణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితిని స్థాపించి ప్రభుత్వ అరాచకాలను ఎండగడుతున్నారు. ఆయన ఇటీవలే పార్టీలో చేరారు. పామర్రు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న వర్ల కుమార్ రాజా సీనియర్ నేత వర్ల రామయ్య కుమారుడు. ఆస్ట్రేలియాలో ఇంజినీరింగ్ చదివారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఆయనకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు.
సూళ్లూరుపేట నియోజకవర్గ అభ్యర్థి నెలవల విజయశ్రీ ఎంబీబీఎస్ చదివి వైద్య వృత్తిలో స్థిరపడ్డారు. ఆమె తండ్రి సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యేగా పనిచేశారు. గంగాధర నెల్లూరు నుంచి పోటీ చేయనున్న వీఎం థామస్ ఎంఎస్సీ, పీహెచ్‌డీ చేశారు. సంతానసాఫల్య నిపుణుడిగా సుప్రసిద్ధులు. ఆయన పరిశోధనలకు పలు అవార్డులు అందుకున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు అభ్యర్థి బొగ్గుల దస్తగిరి న్యాయవాద వృత్తిలో ఉన్నారు. తండ్రి రాముడు గతంలో పసుపుల సర్పంచ్‌గా పనిచేశారు. ఆయన తల్లి సుశీలమ్మ ప్రస్తుతం సర్పంచ్‌గా పనిచేస్తున్నారు. వీరు ఎప్పటి నుంచో పార్టీకి మద్దతుగా ఉంటున్నారు.
వెనకబడిన వర్గాలకే టీడీపీ-జనసేన తొలి జాబితాలో పెద్దపీట
టికెట్‌ల కేటాయింపులో సీనియర్ ఎస్సీ నాయకులకూ సముచిత స్థానం కల్పించారు. గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గం నుంచి గెలిచిన డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ప్రస్తుతం శాసనసభలో పార్టీ విప్‌గా పనిచేస్తున్నారు. గడచిన ఐదేళ్లలో అధికార పార్టీ నేతల దాష్టీకంపై గట్టి పోరాటం చేశారు. ఆయనకు మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పించారు. నక్కా ఆనంద్‌బాబు, కొండ్రు మురళీ మోహన్, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌లకు మళ్లీ టికెట్లు దక్కాయి. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితకు గతంలో ఆమె ప్రాతినిధ్యం వహించిన పాయకరావుపేట నుంచే మళ్లీ అవకాశం ఇచ్చారు. విశ్రాంత ఐఏఎస్ రామాంజనేయులకు మరోసారి టికెట్ దక్కింది.
సీటు రాని ఆశావహులకు చంద్రబాబు హామీ- తన నివాసంలో ప్రత్యేకంగా భేటీ