TDP Leaders Inspecting Venue for Chandrababu Swearing-in Ceremony: ఈ నెల 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో అందుకు అనువైన స్థలం కోసం నేతలు అన్వేషిస్తున్నారు. 12న ఉదయం 11.27 నిమిషాలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.
చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న సభా స్థలాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్, మంతెన సత్యనారాయణ రాజు, పెందుర్తి వెంకటేష్ తదితరులు పరిశీలించారు. ముందుగా మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని స్థలాన్ని పరిశీలించగా దాని కంటే ఐటీ పార్క్ స్థలం అనువైనదిగా భావించారు. సభ స్థలంపై చంద్రబాబు తుదినిర్ణయం తీసుకోనున్నారని తెలిపారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోదీ, ఎన్డీఏ రాష్ట్రాల నేతలు, పలువురు ముఖ్యమంత్రులు రానున్నారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లుపై సమీక్ష: రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగానే తెలుగుదేశం విజయోత్సవ సభ కూడా జరుగుతుందని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (TDP state president Achchennaidu) స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయంలో ఉన్నతాధికారులు, తెలుగుదేశం నేతలు భేటీ అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లుపై సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, డీజీపీ, కృష్ణ జిల్లా కలెక్టర్, అచ్చెన్నాయుడు, ఇతర ఉన్నతాధికారులు, నేతలు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరవుతారని నేతలు తెలిపారు. భద్రతా, రవాణా, ప్రజా సౌకర్యం ఇలా అన్ని రకాలుగా ఎయిమ్స్ సమీపంలోని ప్రదేశం కంటే గన్నవరం ప్రదేశం అనువుగా ఉందని అన్నారు. ముందుగా మంగళగిరిలోని ఎయిమ్స్ సమీపంలోని ప్రదేశం చూశాము కాని దానికంటే గన్నవరంలో ఉన్న ప్రదేశం అన్నిరకాలుగా అనువుగా ఉందన్నారు. అధినేత చంద్రబాబు దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని అచ్చెన్న వెల్లడించారు.
పవన్ అంటే వ్యక్తి కాదు తుపాను: జనసేన అధినేతపై మోదీ ప్రశంసలు - Modi Praises Pawan Kalyan