TDP Leaders Condemn Prathipati Pullarao Son Sarath Arrest : జీఎస్టీ అధికారుల ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ను అరెస్టు చేశారు. శరత్‌ను టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో విచారిస్తున్నట్లు సమాచారం. శరత్‌పై జీఎస్టీ విభాగం మనీలాండరింగ్, పన్ను ఎగవేత అభియోగాలు మోపింది. ఐపీసీ 420, 409, 467, 471, 477(ఏ), 120 బీ రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద శరత్‌పై మాచవరం పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. ప్రత్తిపాటి కుమారుడు, భార్య, బావమరిది సహా ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ప్రత్తిపాటి కుమారుడిని అక్రమంగా అరెస్టు చేశారంటూ టీడీపీ కార్యకర్తలు సీపీ కార్యాలయానికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్ధృతంగా మారింది.
మూడు నెలల్లో మూల్యం చెల్లించుకోక తప్పదు : మాజీ మంత్రి పుల్లారావు కుమారుడి అక్రమ అరెస్ట్ అంటూ ముమ్మాటికి ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్నికల వేళ జగన్ కక్ష సాధింపు రాజకీయాలు మరింత తీవ్రమయ్యాయని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో వ్యవస్థలను అడ్డుపెట్టుకుని తెలుగుదేశంపార్టీ నాయకులను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగమే మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసుల అదుపులో ప్రత్తిపాటి కుమారుడు - విజయవాడ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ అఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్ ద్వారా అక్రమ కేసులు పెట్టి టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలను వేధించడానికి సీఐడీని తన జేబు సంస్థగా మార్చుకున్నట్లే, ఇప్పుడు ఏపీఎస్ఆర్డీఐ ద్వారా కూడా రాజకీయ కక్షలను తీర్చుకుంటోందని దుయ్యబట్టారు. ఎన్నికల ముంగిట పార్టీ అభ్యర్థులను బలహీన పరిచేందుకే ఈ కుట్రలన్నారు. ఏపీఎస్ఆర్డీఐ బెదిరింపులు, వేధింపులు తట్టుకోలేక వివిధ వర్గాల వ్యాపారులు కోర్టుకు వెళ్లింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 40 రోజుల్లో ఇంటికి పోయే వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అనుబంధ విభాగ సభ్యులుగా పని చేస్తే, అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
హాని తలపెట్టారా అనే అనుమానాలు కలుగుతున్నాయి : శరత్‍ను తీసుకెళ్లింది పోలీసులా, సైకో జగన్ తాడేపల్లి ముఠానా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. టెర్రరిస్టుని అరెస్టు చేసినట్టు ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారని నిలదీశారు. శరత్‌కి ఏమైనా హాని తలపెట్టారా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఈ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు. ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేసారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని, బలమైన టిడిపి నేతలే లక్ష్యంగా సైకో జగన్ పన్నుతున్న కుతంత్రాలను తిప్పికొడతామని హెచ్చరించారు. శరత్‌ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. జగన్ దిగిపోయే ముందైనా ఇటువంటి సైకో చేష్టలు ఆపకపోతే, చాలా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.
పోలీసులే ప్రతిపక్ష నేతలను కిడ్నాప్ చేస్తున్నారు : ప్రత్తిపాటి శరత్ అరెస్టును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. వ్యాపారంతో ఎటువంటి సంబంధం లేని ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను అకారణంగా అరెస్ట్ చేసారని విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్ అండతో పోలీసులే ప్రతిపక్ష నేతలను కిడ్నాప్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అక్రమ కేసులతో ప్రతిపక్ష పార్టీ నేతలను వేధిస్తున్న జగన్ సర్కార్‌కు మరో 45 రోజుల్లో రాజకీయ సమాధి కట్టడం ఖాయమని వెల్లడించారు.
జగన్‌కు భయం పట్టుకుంది : పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అక్రమ అరెస్టుపై తెదేపా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అతని ఆచూకీ చెప్పాలని, ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలును ఇబ్బంది పెట్టడమే జగన్ లక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేని జగన్, కొడుకు మీద కేసు పెట్టించాడని ఎద్దేవా చేసారు. జగన్‌కు భయం పట్టుకుందని ఇంతకంటే ఉదాహరణ లేదన్నారు.