Tax Burden on People in Vijayawada Municipal Corporation: వైసీపీ పాలనలో ప్రజలపై పెద్ద ఎత్తున పన్నుల భారం పడుతోంది. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలపై యూజర్ ఛార్జీల పేరుతో పన్నుల భారాన్ని మోపుతున్నారు. రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.26 కోట్ల వసూలు చేసిన వీఎంసీ(VMC) ఈ ఆర్థిక సంవత్సరానికి 18 కోట్ల రూపాయలు వసూలు చేయటమే లక్ష్యంగా పనిచేస్తోంది.
అయితే వీఎంసీ చర్యలను కొంతమంది నగర ప్రజలు తిప్పికొడుతున్నారు. వైసీపీ పాలక మండలి యూజర్ ఛార్జీల పేరుతో బెజవాడ ప్రజలపై వేస్తున్న చెత్తపన్నును నగరంలోని సగం మంది ప్రజలు నేటికీ చెల్లించడం లేదు. సంక్షేమ పథకాల్లో కోతలు పెడతామని బెదిరించినా వెనక్కు తగ్గటంలేదు. నోటీసులు పంపించినా నగర వాసులు జంకటంలేదు. వైసీపీ ప్రభుత్వం విధించే చెత్త పన్నును కట్టబోమని ప్రజలు తేల్చిచెబుతున్నారు.
జగనన్న వీర బాదుడు మామూలుగా లేదుగా - సామాన్యుడి గుండె గుభేల్!
వీఎంసీ పరిధిలో నివాసం ఉంటున్న ప్రజల నుంచి యూజర్ ఛార్జీల పేరుతో చెత్తపన్ను, మురికివాడల్లో 30 రూపాయలు, నాన్ స్లమ్ ఏరియాలో రూ.60, రూ.120 వసూలు చేస్తున్నారు. వ్యాపార సముదాయాల్లో అయితే 200 రూపాయల నుంచి 15వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. యూజర్ ఛార్జీల వసూలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. దీంతో ఒక్కో మున్సిపాలిటీ, నగర పాలక సంస్థల్లో ఒక్కో విధంగా వసూళ్లు ఉంటున్నాయి.
ప్రజలపై ఎడాపెడా పన్నులు వసూలు చేస్తోన్న సర్కార్ నిర్వహణపై దృష్టి పెట్టడంలేదని స్థానికులు వాపోతున్నారు. విజయవాడలో 15లక్షల మందికి పైగా ప్రజలు జీవిస్తున్నారు. సుమారు 6లక్షల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. విజయవాడ నగర విస్తీర్ణం 61.88 చదరపు కిలోమీటర్లు ఉంది. నగరంలో ఇంటింటి చెత్త సేకరణకుగానూ 220 క్లాప్ వాహనాల ఉన్నాయి. ఈ వాహనాల ద్వారా ప్రతి రోజు ఇంటింటికి వెళ్లి పారిశుద్ధ్య సిబ్బంది చెత్త సేకరిస్తున్నారు.
విజయవాడ నగర పారిశుద్ధ్యం కోసం సుమారు 3వేల 600 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. అయినా చాలా కాలనీల్లో నిర్వాహణ అధ్వానంగా ఉంటోంది. దీంతో ప్రజలు దోమలు, ఈగలు వంటి సమస్యలతో పాటు పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
గత ఐదేళ్లలో తమపై ఎడాపెడా పన్నులు భారం వేసిన వైసీపీని ఇంటికి పంపించడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. మరో రెండు నెలల్లో జరగనున్న ఎన్నికల్లో జగన్ సర్కార్‌కి తమ ఓటుతో తగిన బుద్ధి చెపుతామని హెచ్చరిస్తున్నారు.