CM Revanth Participate in Telangana Decade Celebrations : రాష్ట్రావిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన సంబురాలు అంబరాన్నంటాయి. ట్యాంక్‌బండ్‌పై 'పదేళ్ల పండుగ' పేరుతో రాష్ట్ర చరిత్ర, వైభవాన్ని చాటేలా ప్రత్యేక కార్యక్రమాలను కాంగ్రెస్ సర్కార్ ఘనంగా నిర్వహించింది. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ రాధాకృష్ణన్‌తో కలిసి అక్కడ స్టాళ్లను పరిశీలించారు.
వర్షంలోనే కొనసాగిన కళా బృందాల ప్రదర్శన : అనంతరం సభాస్థలికి గవర్నర్‌ను సీఎం ఆహ్వానించగా, ముఖ్యమంత్రికి సీఎస్ శాంతి కుమారి ఆహ్వానం పలికారు. గవర్నర్‌తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేపట్టారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చరిత్రను, వైభవాన్ని చాటి చెప్పేలా 17 రకాల కళారూపాలు ప్రదర్శించారు. మరోవైపు వేడుకలు జరుగుతున్న సమయంలో వర్షం పడటంతో సాంస్కృతిక కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడినప్పటికీ, ఘట విన్యాసం, ఒగ్గుడోలు, బోనాల కోలాటం, గుస్సాడీ, బతుకమ్మ తదితర కళారూపాల ప్రదర్శన ఆద్యంతం కన్నుల పండువగా సాగింది.
Telangana Formation Day Celebrations 2024 : తెలంగాణకు నృత్య నీరాజనం పేరుతో వేదికపై ప్రదర్శించిన సంప్రదాయ, పేరిణి భేరిణి శివతాండవం తదితర నృత్య రూపాలు అందరినీ ఎంతగానో ఆకర్షించాయి. ట్యాంక్ బండ్‌ను పూర్తిగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆ తర్వాత కార్నివాల్ ఆకట్టుకుంది. అనంతరం జయజయహే తెలంగాణ రాష్ట్ర పూర్తి నిడివి గీతాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఒకవైపు రాష్ట్ర గీతం కొనసాగుతుండగానే, ఐదువేల మంది శిక్షణ పొందిన పోలీసులు జాతీయ పతాకాలతో ప్లాగ్ మార్చ్ చేశారు.
ట్యాంక్‌బండ్‌పై ఆకట్టుకున్న లేజర్ షో : వర్షంలో సైతం శిక్షణ పొందిన పోలీసులు చేసిన ప్లాగ్ మార్చ్ చూపుతిప్పుకోకుండా చేసింది. ఆ వెంటనే ఆకాశంలోకి దూసుకొచ్చిన రంగురంగుల బాణాసంచా అత్యద్బుతంగా ఉంది. వర్షంలో సైతం నగర ప్రజలు బాణాసంచాను చూస్తూ చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తంచేశారు. చివరగా ఏర్పాటు చేసిన లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళాకారులు రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చారు.
రాష్ట్ర గీతం రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించారు. ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీప్ దాస్ మున్షీ, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ప్రొఫెసర్ కోదండరాంలు పాల్గొన్నారు. అనంతరం వాన జోరు పెరగటంతో అనుకున్న సమయాని కంటే ముందుగానే కార్యక్రమాన్ని ముగించాల్సి వచ్చింది.
తెలంగాణ ఏర్పాటుకు ఈ స్థూపమే కారణం : అమరవీరుల స్థూపం రూపశిల్పి - Telangana Martyrs Stupa Sculptor