Tadepalli Palace Road Restrictions Have Been Removed : అదేదో తన సొంతమైనట్లు ప్రజల కేమీ సంబంధమే లేనట్లు 4లేన్ల రహదారిని ప్రైవేటు రోడ్డుగా మార్చుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ పెత్తందారీ పోకడలకు కూటమి ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తోంది. గతంలో సీఎం క్యాంపు కార్యాలయం, ప్రస్తుత వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయానికి వినియోగిస్తున్న రహదారిపైకి ఎట్టకేలకు ప్రజలకు అనుమతి లభించింది. తాడేపల్లి ప్యాలెస్ ఎదుట ఇప్పటి వరకూ ఉన్న ఆంక్షలకు చరమగీతం పాడారు. రోడ్డు అందుబాటులోకి రావడంతో ఎన్నాళ్లో వేచిన ఉదయం వచ్చిందంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Jagan Tadepalli Palace Road Clear : మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉండే ప్యాలెస్ ఎదుట ఆంక్షలు తొలగిపోయాయి. ఇన్నాళ్లూ జగన్ సేవకే పరిమితమైన 4లేన్ల రహదారి ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. జగన్ సీఎం అయ్యాక ఆయన ఇంటి పక్కన ఉండే పేదలను అక్కడ నుంచి ఖాళీ చేయించిన పోలీసులు రహదారిని పూర్తిగా దిగ్బంధించారు. ఈ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. గతంలో ఫొటోలు, గుర్తింపు కార్డులు చూపించిన తర్వాతే జనాన్ని రోడ్డుపైకి పోలీసులు అనుమతించారు. ఉన్నతాధికారులు సైతం ఫొటోలు, గుర్తింపు కార్డులు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు, రైతులు, కూలీలకు రోడ్డు అందుబాటులోకి రావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రహదారులు భవనాల శాఖ నిర్మించిన ఆ రహదారిపైకి స్థానికంగా రాకపోకల్ని నిషేధించటం తీవ్ర వివాదం రేపింది. 'గడచిన ఐదేళ్లుగా ఈ రహదారిని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం మాత్రమే వినియోగించారు. ఇతరులెవరికీ ప్రవేశం లేకుండా నిషేధించారు. జగన్ ముఖ్యమంత్రి పదవి పోగానే, క్యాంపు కార్యాలయాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంగా మార్చేశారు. ఐనా ఆ మార్గంలోకి ఎవరినీ అనుమతించకవడం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి!
సొమ్ము ప్రజలది సోకు జగన్‌ది - తాడేపల్లి ప్యాలెస్ రోడ్డంతా ఆక్రమణే - Former CM occupy public propert
వాస్తవానికి ప్రకాశం బ్యారేజీ నుంచి రేవేంద్రపాడు వరకూ డబుల్ లేన్ రోడ్డు కోసం అప్పట్లో 5కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. కానీ, ఆ నిధులతో జగన్ క్యాంపు కార్యాలయ పరిధిలో ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్డు మాత్రమే వేశారు. అప్పట్లో భద్రతాసిబ్బంది ఆ రోడ్డుపైకి ఎవర్నీ అనుమతించలేదు.' - స్థానిక ప్రజలు
ఇప్పుడు జగన్ సీఎం హోదాలో లేకపోయినా ప్రజాధనంతో నిర్మించిన రోడ్డుపైకి ప్రజలనెవరినీ జగన్ భద్రతా సిబ్బంది అనుమతించకపోయేసరికి స్థానిక ప్రజల నుంచి కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.