Suspicious Death in Nandikotkur : సంచలనం సృష్టించిన నంద్యాలలో బాలిక హత్య ఘటన నిందితుడు ఎ.హుస్సేన్ పోలీసు విచారణలో అనుమానాస్పదంగా మృతి చెందారు. లాకప్‌డెత్ అని అనుమానాలు వ్యక్తమవుతుండగా తప్పించుకునే క్రమంలో అనారోగ్యానికి గురై నిందితుడు చనిపోయారని పోలీసులు చెబుతున్నారు. పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ నెల 7న(జులై 7న) ఓ బాలికపై ముగ్గురు బాలురు అత్యాచారం చేసి మృతదేహాన్ని మాయం చేశారు. ముగ్గురు బాలురను, వారిలో ఒకరి తండ్రి, పెదనాన్నను పోలీసులు అరెస్టు చేసి ఇప్పటికే రిమాండుకు తరలించారు.
మరో బాలుడి మేనమామ హుస్సేన్‌కూ సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. బాలిక మృతదేహాన్ని మాయం చేయడంలో కీలకపాత్ర పోషించారని తేలింది. పోలీసులు మూడు రోజుల కిందట ఆయనను అదుపులోకి తీసుకుని మిడుతూరులోని ఓ రహస్య ప్రాంతంలో విచారించినట్లు సమాచారం. తర్వాత నంద్యాలలోని సీసీఎస్ పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ శనివారం ఉదయం విచారణ చేస్తుండగా గుండెపోటుతో నిందితుడు కుప్పకూలడంతో పోలీసులు నంద్యాలలోని సర్వజన ఆసుపత్రికి తరలించారు. హుస్సేన్ వెంట ఇద్దరు వ్యక్తులను తోడుగా పంపారు. ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే ఆయన చనిపోయారని వైద్యులు ధ్రువీకరించారు. హుస్సేన్‌ను తీసుకెళ్లిన వ్యక్తులు ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారు.
మైనర్ బాలికపై హత్యాచారం - ఐదుగురు నిందితులు అరెస్ట్ - Minor Girl Disappearance Case
అనారోగ్యంతో మృతి : హుస్సేన్ మృతికి సంబంధించి ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలు బాధ్యులన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విచారణలో మరో కానిస్టేబుల్, హోంగార్డూ పాల్గొన్నట్లు సమాచారం. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అనారోగ్య సమస్యతో హుస్సేన్ మృతి చెందినట్లు ఎస్పీ అదిరాజ్‌సింగ్ రాణా తెలిపారు. మసీదుపురం మెట్ట నుంచి నందికొట్కూరుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో తలముడిపి సమీపంలో పోలీసు జీపు నుంచి దూకి పరారయ్యేందుకు హుస్సేన్ ప్రయత్నించాడన్నారు. పోలీసులు వెంటాడి పట్టుకున్నారని, ఆ సమయంలో ఆయాసపడుతూ ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో వెంటనే హుస్సేన్‌ను నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. హుస్సేన్ మృతిపై మిడుతూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించినట్లు తెలిపారు. హుస్సేన్ కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు మేజిస్ట్రేట్ ముందు ఆయన బంధువులు తెలిపినట్లు వివరించారు. పోస్టుమార్టం ప్రక్రియను వీడియో తీయించామని, చట్ట ప్రకారం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఘటన నేపథ్యంలో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.
నేరస్థుడికి పార్టీ, కులం ఉండదు - వారిని కఠినంగా శిక్షిస్తాం: హోంమంత్రి అనిత - Home Minister On Rape Incidents