Suriya Kanguva Movie : విశాఖలో సినీ నటుడు సూర్య సందడి చేశారు. కంగువా చిత్ర ప్రమోషన్లో భాగంగా విశాఖలో నటుడు సూర్య అభిమానులు కలుసుకున్నారు. విశాఖలో మెగా ఈవెంట్‌ను నిర్వహించారు. ప్రతిష్టాత్మక చిత్రాలు నిర్మించినటువంటి స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో దర్శకుడు శివ, సినిమాటోగ్రఫీ వెట్రీ కాగా, కేఈ జ్ఞానవేల్ రాజా, ప్రమోద్ ఉప్పలపాటి, వి వంశీకృష్ణారెడ్డి నిర్మాతలుగా తెరకెక్కించిన చిత్రం కంగువా.
నటుడు సూర్య, దిశా పటాని కథానాయకగా, ముఖ్య నటీనటులుగా బాబీ దేవోల్, యోగి బాబు, సహా జగపతిబాబు, నటరాజ సుబ్రహ్మణ్యం, కోవై సరళ తదితరులు తారాగణంగా నిలిచిన కంగువా చిత్రం వచ్చేనెల 14న విడుదలవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా చిత్ర నటీనటులు సూర్య, దిశా పటాని, దర్శకుడు శివ తదితరులు విశాఖలో పర్యటించి అభిమానులను అలరించారు.
భారతదేశ చలనచిత్ర శక్తిని ప్రపంచవ్యాప్తంగా చూపించే సత్తా ఉన్న చిత్రం కంగువా అని నటీనటుల తెలియజేశారు. గతంలో గజినీ, సెవెంత్ సెన్స్, సింగం, తదితర చిత్రాలను ఆదరించినట్టే ఈ చిత్రాన్ని ఆదరిస్తారని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు సినీ నటుడు సూర్య. దర్శకుడు శివ అద్భుతమైన స్టోరీతో చిత్రం అలరిస్తుందని, బాలీవుడ్ నటుడు బాబి దేవోల్ తన అత్యుత్తమ ప్రదర్శన చూపించారని చెప్పుకొచ్చారు. అనంతరం చిన్నారులతో సూర్యతో ఫొటోలు దిగారు. అదే విధంగా అభిమానులు సెల్ఫీలు తీసుకుని సంబరపడ్డారు. విశాఖ బీచ్‌లో కంగువా చిత్రం ప్రమోషన్ ఘనంగా జరిగింది.
ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా కంగువా: ఇక ‘కంగువా’ సినిమా విషయానికొస్తే శివ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా రెండు పార్టులుగా రానుంది. ఫస్ట్ పార్ట్ నవంబర్ 14న విడుదల కానుంది. ఇందులో సూర్య విభిన్న లుక్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. పీరియాడిక్ యాక్షన్ జానర్‌లో ఇప్పటివరకు తెరపైకి రాని ఓ కొత్త కాన్సెప్ట్ ఇందులో ఉందని, 10 భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ కంగువా సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.