Supreme Court Angry Over Illegal Sand Mining in AP: రాష్ట్రంలో ఇసుక అక్రమాలు ఆపాలన్న ఆదేశాలను పక్కనబెట్టి యథేచ్చగా తవ్వకాలు కొనసాగించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డుకోలేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ధర్మాసనం మండిపడింది. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకోవడానికి ప్రతి జిల్లాలో కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటుచేయాలని ఆదేశించింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రత్యేక వ్యవస్థను సిద్ధంచేయాలని నిర్దేశించింది. ఈ-మెయిల్ , టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంచాలని దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశాలిచ్చింది.
వ్యవస్థకు వచ్చే ఫిర్యాదులను జిల్లా కమిటీలకు పంపించి వెంటనే పరిష్కరించాలని తేల్చిచెప్పింది. రెండు మూడు రోజుల్లో ఈ వ్యవస్థను ఏర్పాటుచేసి, ప్రధాన ప్రతివాదిగా ఉన్న దండా నాగేంద్ర కుమార్‌కు సమాచారం ఇవ్వాలంది. నాలుగు రోజుల్లోపు ఇసుక అక్రమ మైనింగ్ జరుగుతున్న రీచ్‌లను సందర్శించి తవ్వకాలు నిలిపివేసేలా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కార చర్యలను తీసుకుంటామని హెచ్చరించింది. కమిటీలోని అధికారులు సుప్రీంకోర్టు నియమించిన విషయాన్ని గుర్తెరిగి విధులు నిర్వహించాలని జస్టిస్ అభయ్.ఎస్ ఒఖా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది.
'ఏపీ ఇసుక మైనింగ్ కేసు'- మార్గదర్శకాలు విడుదల చేసిన సుప్రీం - SC Orders on Sand Mining in AP
ఏపీలో యథేచ్చగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సుప్రీంకోర్టుకు మధ్యంతర నివేదిక సమర్పించింది. కేంద్ర పర్యాటక శాఖ కమిటీ ధృవీకరణతో ధర్మాసనం మార్గదర్శకాలు జారీ చేసింది. 10 వేల కోట్ల రూపాయలకు పైగా ఇసుక అక్రమ రవాణా జరిగిందని ప్రతివాది దండా నాగేంద్ర కుమార్ తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. గత నెల 29న, ఈ నెల 10న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేశాక కూడా ఏపీ ప్రభుత్వం ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగిస్తోందంటూ ఫొటోలు, ఇతర ఆధారాలను ధర్మాసనానికి సమర్పించారు. జీపీఎస్ మ్యాపింగ్ కెమెరా ద్వారా సేకరించిన ఆధారాలు, మీడియాలో వచ్చిన కథనాలను సుప్రీంకోర్టుకు అందించారు.
ఇసుక అక్రమార్కులు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అడ్డగోలు తవ్వేస్తున్నట్లు సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, కంపెనీలు కలిసిమెలిసి అక్రమ ఇసుక మైనింగ్ చేస్తున్నట్లు వివరించారు. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి అక్రమ ఇసుక తవ్వకాలు ఆపేశారా? లేదా? అన్నది తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర అధికారులు సందర్శించే విషయాన్ని రాష్ట్ర అధికారులకు చెప్పాల్సిన అవసరం లేదని, సమాచారం కూడా ఇవ్వొద్దని స్పష్టం చేసింది.
ఇసుక అక్రమ తవ్వకాలపై వచ్చిన ఫిర్యాదుల మీద చర్యలు తీసుకుంటామన్న ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ వివరాలు పట్టించుకోని సుప్రీంకోర్టు ధర్మాసనం మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై జులై 9 లోపు సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించిన ధర్మాసనం జులై 15న తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. అప్పటి లోగా ఇతర వివరాలు కోర్టుకు అందించాలని స్పష్టంచేసింది.