Young Film Makers Success Story : ఉన్నత చదువులు చదివి విదేశాల్లో స్థిరపడే ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉన్నాసినిమాపై అభిరుచితో టాలీవుడ్ బాట పట్టారు ఈ యువత. సినీ పరిశ్రమలో ఎవరు తెలియకున్నా ఒక్కో అడుగువేస్తూ ముందుకు సాగారు. ఏడాదిన్నరపాటు శ్రమించి నీ దారే నీ కథచిత్రం తీర్చిదిద్దారు. సినిమా కోసం ఏడాదిన్నరపాటు కష్టపడ్డా ఆ కలను నేరవేర్చుకోడానికి వీరికి పదేళ్లు పట్టింది.
"నీ దారే నీ కథ" ఫిల్మ్‌తో తెలుగు తెరకు పరిచయం : గుంటూరు జిల్లాలో పుట్టిన హర్షిత అమెరికాలో చదువుకుంది. చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకునే అలవాటు పెద్దయ్యాక హర్షితను నాటకాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌ను చేసింది. అమెరికాలో డిజైనర్‌గా పనిచేసి అనుభవం సంపాదించుకున్న హర్షిత మాతృ దేశంపై మమకారంతో భారత్‌కు తిరిగి వచ్చింది. సినిమాలపై ఇష్టంతో పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా సేవలందించింది. ఈ క్రమంలోనే నిర్మాణ రంగంపై ఆసక్తి పెంచుకుని జేవీ ప్రొడక్షన్స్‌తో కలిసి పనిచేయడం మొదలు పెట్టింది.
జేవీ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించిన వంశీ : వైజాగ్‌కు చెందిన వంశీ జొన్నలగడ్డ పూర్తిగా వ్యాపార కుటుంబంలో పుట్టి పెరిగిన యువకుడు. బీబీఏ చేసి వ్యాపారం చేయాలనుకున్నాడు. కానీ తన మనస్సు సినిమాల వైపు మళ్లింది. ఫిల్మ్ ప్రొడక్షన్‌లో మాస్టర్ డిగ్రీ చేశాడు. అదే సమయంలో డైరెక్షన్ కోర్సు కూడా పూర్తి చేశాడు. ఇక సినిమా తీయడమే అనుకున్నాడు. కానీ అనుకున్నంత సులువుగా వంశీకి అవకాశం దొరకలేదు. దాంతో తానే అవకాశం సృష్టించుకొని జేవీ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించాడు.
అన్నపూర్ణ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో పాఠాలు : తల్లిదండ్రుల కోసం ఇంజినీరింగ్ చేసి తన కోసం సినిమా ప్రయాణం మెుదలు పెట్టాడు తేజేశ్ వీర. అన్నపూర్ణ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరి పాఠాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత తెరముందు కంటే తెర వెనుక ఉండటమే తనకు సరైన అవకాశమని గ్రహించాడు. వంశీతో కలిసి జేపీ ప్రొడక్షన్స్ బాధ్యతల్లో భాగస్వామ్యమయ్యాడు.
ఆర్కిటెక్ట్‌గా జీవితం మొదలు : హర్షిత, వంశీ, తేజేశ్‌ల కథ ఇదైతే వాళ్ల కథకు కథానాయకుడిగా దొరికాడు తిరుపతికి చెందిన ప్రియతమ్. ఆర్కిటెక్ట్‌గా జీవితం మొదలుపెట్టి తనకున్న అభిరుచి మేరకు హైదరాబాద్‌లో ఆడిషన్స్ ఇస్తూ అదృష్టం పరీక్షించుకునేవాడు. చాలా నిర్మాణ సంస్థలు ప్రియతమ్ సమయాన్ని వృథా చేసేవే తప్ప అవకాశాలు ఇవ్వలేదు. ఈ క్రమంలోనే జేవీ ప్రొడక్షన్స్ ప్రతిభ గుర్తించి అవకాశం ఇచ్చిందని ఆనందంగా చెబుతున్నాడు ప్రియతమ్.
అవకాశాల కోసం అన్వేషిస్తూనే కుదరని పక్షంలో తమకు తామే అవకాశాలు సృష్టించుకుంటూ భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకుంటున్నారు ఈ యువత. తొలి సినిమా నీ దారే నీ కథతో ప్రేక్షకులను మెప్పించారు. జయపజయాలు, లాభాపేక్షతో సంబంధం లేకుండా సృజనాత్మకత ప్రదర్శిస్తూ ప్రశంలందుకుంటున్నారు. జేవీ అంటే పేరులా కాకుండా జాయింట్ వెంచర్లా ఒకరి ఆలోచనలను మరొకరు పంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు కృషి చేస్తున్నారు.
YUVA : ఆమె గురిపెడితే పతకం పక్కా - ఒలింపిక్ మెడలే నెక్ట్స్ టార్గెట్
YUVA : అక్షరంతో యుద్ధం చేస్తూ కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురష్కారానికి ఎంపికైన గిరిపుత్రుడు