Students Blood Vomit : హైదరాబాద్ నగరంలోని చింతల్లో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మూడో అంతస్తులో ఉన్న బాత్రూంలో కిందపడిన యాసిడ్ బాటిల్ ఘాటు వాసన రావడంతో విద్యార్థులు రక్తపు వాంతులు చేసుకున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా విద్యార్థులను స్కూల్ యాజమాన్యం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించింది. సకాలంలో స్పందించి వైద్యం అందించడంతో విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో పాఠశాల ముందు వారు ఆందోళనకు దిగారు.
ఈ ఘటనతో హుటాహుటిన పాఠశాలలో ఉన్న విద్యార్థులను శ్రీ చైతన్య యాజమాన్యం ఇంటికి పంపించింది. 40 నుంచి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతానికి పల్స్ ఆసుపత్రిలో కొందరు విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. మరికొంద మంది విద్యార్థులను ప్రాణాధార ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. పాఠశాల ముందు ఏబీవీపీ విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు.
విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం, కుత్బుల్లాపూర్‌లోని చింతల్ శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల భవనం మూడో అంతస్తులో 7,8 తరగతుల విద్యార్థులు తరగతి గదిలో చదువుకుంటున్నారు. అదే సమయంలో బాత్ రూం శుభ్రం చేసేందుకు వాడే యాసిడ్ బాటిల్‌తో క్లాస్ రూమ్ గోడలు శుభ్రం చేయడంతో ఘాటైన వాసనలు చెలరేగి, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దాదాపు 40 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఘాటైన వాసన తట్టుకోలేక కొందరు విద్యార్థులు రక్తంతో వాంతులు చేసుకున్నారు.
తల్లిదండ్రుల ఆందోళన : తల్లిదండ్రులకు కనీస సమాచారం ఇవ్వకుండా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ఆసుపత్రికి తరలించారు. కొందరు తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, తమ పిల్లలకు ఇంత ఇబ్బంది కలుగుతున్నా, కనీసం సమాచారం ఇవ్వకపోగా జరిగిన విషయాన్ని దాచిపెట్టి ప్రిన్సిపల్ ఏం కాలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల సమయం ముగియక ముందే పిల్లలను ఇంటికి పంపించడంతో కొందరు తల్లిదండ్రులు ఏం జరిగిందో తెలియక అయోమయంలోకి వెళ్లిపోయారు. సాయంత్రం వరకు కొందరు విద్యార్థులు చికిత్స తీసుకొని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలపడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
మాగనూరు జడ్పీ పాఠశాలకు ఏమైంది? - మరోసారి వికటించిన మధ్యాహ్న భోజనం - ఈసారి 40 మందికి పైగా అస్వస్థత
ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ - 24 మంది విద్యార్థులకు అస్వస్థత