Student Farmers in Jagtial : ఒకసారి చూసిన దానికన్నా, స్వయంగా ఆచరించటం మరింత ప్రయోజనం కలిగిస్తుందన్న నానుడి ఈ విద్యార్థులకు సరిగ్గా సరిపోతుంది. కేవలం పుస్తకాల్లో ఉన్నది చదువుకోవడమే కాకుండా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రాక్టికల్స్ చేస్తున్నారు. కళాశాల ప్రోత్సాహంతో రైతులుగా మారి భవిష్యత్తు ప్రణాళికలు నిర్దేశించుకుంటున్నారు. కెరీర్‌లో ఎదిగేందుకు అవసరమైన ప్రతిభ, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు.
యూపీఎస్సీ తుది ఫలితాలు విడుదల - సత్తా చాటిన తెలుగు విద్యార్థులు - UPSC final Results 2023
Students Study with Field Experience Jagtial : వీరంతా జగిత్యాల జిల్లా పొలాస వ్యవసాయ కళాశాలకు చెందిన విద్యార్థులు. ప్రస్తుతం బీఎస్సీ అగ్రికల్చర్ 4వ సంవత్సరం చదువుతున్నారు.మెుదటి 3 సంవత్సరాల్లో జరిగిన 6 సెమిస్టర్లో తరగతి గదులకే పరిమితమైన విద్యార్థులు, చివరి రెండు సెమిస్టర్ల కోసం క్షేత్రస్థాయిలో వ్యవసాయం చేస్తున్నారు. ఎనిమిదో సెమిస్టర్‌లో అగ్రికల్చర్ ఎక్స్‌పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థులే స్వయంగా అంశాలను ఎంచుకుని ఇలా కృషి చేస్తున్నారు.
పొలాస వ్యవసాయ కళాశాల ప్రోత్సాహంతో వినూత్నంగా రాణిస్తున్నారు ఈ విద్యార్థులు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎస్.నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నేతృత్వంలో విద్యార్థులు బృందాలుగా ఏర్పడ్డారు. వర్మికంపోస్టు తయారీ, పుట్టగొడుగుల పెంపకం, మిశ్రమపిండి తయారీ, విత్తనోత్పత్తి, భూసార పరీక్ష, కూరగాయలసాగు తదితర అంశాలను తీసుకుని ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు.
మెుదట రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల నుంచి నాణ్యతగల విత్తనాలను తీసుకువచ్చి పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టారు ఈ విద్యార్థులు. అయితే పుస్తకాల్లో ఎన్నిసార్లు చదవినా అసలు అర్థం కాని విషయాలు, స్వయంగా ఉత్పత్తి చేస్తుంటే స్పష్టంగా అర్థం అవుతుందని అంటున్నారు.అలాగే అందరిలా కాకుండా స్టెరిలైజేషన్ చేసిన వరిగడ్డిలో పుట్టగొడుగుల విత్తనాలను వేసి పెంచుతున్నారు.
వినూత్నంగా ఆలోచించి వైవిధ్యంగా సాగు చేస్తున్నారు ఈ విద్యార్థులు. సాగులో అన్ని పనులను స్వయంగా చేస్తూ, లాభాలు అందుకుంటున్నారు. వచ్చిన లాభంలో 50 శాతం విద్యార్థులు తీసుకుని 40 శాతం కళాశాలకు, 10 శాతం కోర్సు డైరెక్టర్‌కు ఇస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో పుట్టగొడుగులకు 500 నుంచి 1,300 రూపాయల వరకు ధర పలుకుతోందని, స్థానికంగానే విక్రయిస్తూ మంచి లాభాలను సంపాదిస్తున్నామని చెబుతున్నారీ ఔత్సాహికులు.
గతంలో కూడా ఇక్కడి విద్యార్థులు చేపట్టిన అంశాల్లో నాలుగింటిని భారత వ్యవసాయ పరిశోధన మండలి గుర్తించింది. దేశవ్యాప్తంగా అన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఈ అంశాలను ఆచరించడానికి ఎంపిక చేసింది. అలాగే ప్రస్తుతం ఉన్న ఈ విద్యార్థులు చేపట్టిన పుట్టగొడుగుల పెంపకం విజయవంతం అవ్వడం మరో విశేషంగా చెబుతున్నారు ఇక్కడి అధ్యాపకులు.
ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించుకుని పంటలను సాగుచేస్తే అన్నదాతలకు లాభదాయకంగా ఉంటుందని చెబుతున్నారు ఈ విద్యార్థులు. రైతులకు నూతన సాగు అంశాలపై అవగాహన పెంచేందుకు ఇలాంటి వినూత్న సాగులను ఎన్నుకున్నట్లు తెలిపారు. అలాగే ఈ ప్రాక్టికల్ నైపుణ్యాలతో భవిష్యత్తులో నలుగురికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు - విజయ రహస్యం అదేనట - Man Got Three Government Jobs