Job Opportunities with Technical Courses : తక్కువకాల వ్యవధి చదువుతో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్న కోర్సు ఐటీఐ. పారిశ్రామిక శిక్షణ పూర్తిచేసిన వారిలో 90 శాతం మంది ఉపాధి పొందుతున్నారు. పదోతరగతి పూర్తి చేసి, వయో పరిమితితో సంబంధం లేకుండా ఐటీఐ కోర్సుల్లో చేరొచ్చని, నిపుణులు చెబుతున్నారు.
Nizamabad ITI Diploma Colleges Admissions Open : నిజామాబాద్ జిల్లాలో ఐదు ప్రభుత్వ, 3 ప్రైవేట్ ఐటీఐలుంటే 1516 మందికి ప్రవేశాలు పొందేఅవకాశం ఉంది. ఐటీఐలో ఏడాది, రెండేళ్ల కాల వ్యవధికోర్సులు ఉన్నాయి. కోర్సులు పూర్తైన వారికి ప్రముఖ కంపెనీలైన బీహెచ్‌ఈఎల్, ఈసీఐఎల్, బీడీఎల్, ఆర్‌ఆర్‌బీ, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి కంపెనీల్లో అప్రెంటిస్ పూర్తి చేసుకొని చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. కోర్సుల్లో చేరే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌తోపాటు హాస్టల్ సదుపాయం ఉందని జిల్లా ఐటీఐ కళాశాలల సమన్వయకర్త కోటిరెడ్డి చెబుతున్నారు.
"మా దగ్గర అడ్మిషన్ నోటిఫికేషన్ మొదలైంది. వచ్చే నెల పదో తేదీ వరకు ఆన్లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. తక్కువ కాలంలో ఉపాధి పొందాలనుకునే వారికి ఐటీఐ ఒక వరంగానే చెప్పుకోవచ్చు. మావద్ద డిఫరెంట్ కోర్సులు, ట్రేడ్‌లు ఉన్నాయి. అలానే ఏడాది, రెండేళ్లు వ్యవధి గల ట్రేడ్‌లకు సంబంధించి కోర్సులు ఉన్నాయి."-కోటిరెడ్డి, జిల్లా ఐటీఐ కళాశాలల సమన్వయకర్త
పాలిటెక్నిక్ చదువుతోనూ ఉద్యోగంలో చేరే అవకాశం : పదోతరగతి తర్వాత ఐటీఐతో పాటు పాలిటెక్నిక్‌లో మూడేళ్ల డిప్లొమా కోర్సులో చేరేందుకు విద్యార్థులకు అవకాశం ఉంది. పాలీసెట్ ప్రవేశపరీక్ష రాస్తే ర్యాంకు ఆధారంగా సీటు లభిస్తుంది. మూడేళ్ల కోర్సులో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ వంటి బ్రాంచ్‌లు అందుబాటులో ఉన్నాయి. రెండున్నరేళ్ల కోర్సు, ఆరు నెలలు ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ ఉంటుంది.
పాలిటెక్నిక్‌తో ఇంజినీరింగ్‌లో చేరే అవకాశం ఉంది. ఈసెట్ పరీక్ష ద్వారా ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో ఎంచుకున్న కోర్సులో చేరే అవకాశం ఉంటుంది. ఇంజినీరింగ్‌లో ఉండే కోర్సులో 80శాతం పాలిటెక్నిక్ డిప్లొమా ద్వారా నేర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఐటీఐకోర్సుల ద్వారా విద్యార్థులు ఉపాధి పొందవచ్చని, నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల ఇంఛార్జ్ ప్రిన్సిపల్ చెబుతున్నారు. తొందరగా ఉపాధి పొందాలనుకునే విద్యార్థులు సాంకేతిక కోర్సుల్లో చేరేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
"పాలిటెక్నిక్ కోర్సు వ్యవధి మూడేెళ్లు, బీటెక్ నాలుగేళ్లలో పూర్తవుతుంది. ఈసెట్ పరీక్ష ద్వారా డైరెక్ట్‌గా డిప్లామా నుంచి బీటెక్ సెకండ్ ఇయర్‌లోకి ఇదివరకే చదివిన బ్రాంచిలో చేరవచ్చు. అలాకాకుండా ఇంటర్ ద్వారా అయితే ఎంసెట్ రాసి కూడా బీటెక్ చేయవచ్చు కానీ ఫస్ట్ ఇయర్‌లో చేరుతారు. ఏదేమైనా ఇంటర్, డిప్లామాలతో కలుపుకొని బీటెక్ పూర్తి కావటానికి ఆరేళ్లు కాలం పడుతుంది."-ఇంఛార్జ్ ప్రిన్సిపల్ నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల
పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారా? ఈ 10 టిప్స్ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ! - Exam Preparation Tips
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? ఈ టాప్-10 టిప్స్ మీ కోసమే!