Students and Youth Suicides : ఇంటర్ చదువుతున్న పిల్లలు తల్లిదండ్రులు మందలించారనో, వారు కావాలనుకున్నది ఇవ్వలేదనో, పరీక్షల్లో మంచి మార్కులు రాకపోవడం, ప్రేమించిన వారు మోసం చేసారని మనస్తాపానికిగురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇంటర్ చదువుకునే ఇద్దరు బాలికలు బలవన్మరణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంటర్ చదువుకునే ఇద్దరు బాలికలు గత శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు ఇంట్లో వండి పెట్టే కూర వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. చిన్నపాటి సమస్యకే మరొకరు ఉరేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా తరచూ ఆత్మహత్యకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులు పిల్లలకు చదువుతో పాటు జీవితంలో ఎదురయ్యే కష్టాలు వాటిని ఎలా ఎదుర్కోవాలో శిక్షణ ఇవ్వాలని.. సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంచి పాఠశాలల్లో శారీరక శ్రమను కలిగించే కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని వ్యక్తిత్వ, మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
శారీరక, మానసిక దృఢత్వం అవసరం : గతంలో ఖాళీ సమయాల్లో, సెలవుల్లో పిల్లల్ని తల్లిదండ్రులు పొలం పనులకు, వ్యాపారాల వద్దకు వెంట తీసుకొని వెళ్లేవారు. ఇప్పుడది నామోషీ అయింది. ఈ వ్యత్యాసం గ్రామీణ ప్రాంతాలతో పోల్చిచూస్తే పట్టణాలు, నగరాల్లో ఎక్కువయింది. రానున్న రోజుల్లో టీనేజర్లు సున్నిత మనస్కులుగా తయారవుతున్నారు. ఫలితంగా చిన్న కష్టానికే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యా స్థితి నివేదిక-2023 ప్రకారం ఉమ్మడి జిల్లాలోని బాలురలో 63.1 శాతం, బాలికల్లో 49.3 మంది నెలలో 15 రోజుల పాటు కుటుంబ వ్యవసాయ, చిరువ్యాపారాల్లో పెద్దలకు సాయపడుతున్నట్లు తేలింది.
సమస్యకు పరిష్కారం ఎలా : ఏదేమైనా యుక్త వయస్కుల వైఖరుల్లో మార్పు తెచ్చేందుకు ఇళ్లల్లో, పాఠశాలల్లో తగిన ప్రయత్నం జరగాలన్నది మానసిక వైద్య నిపుణుల సూచన.
- జాతీయ సేవా పథకం, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ విభాగాల్లో విద్యార్థులు పాల్గొనేలా చూసుకోవాలి. స్కౌట్స్, గైడ్స్‌లో చేరిన వారికి విజ్ఞానాంశాలతో పాటు శరీర దృఢత్వానికి శిక్షణ ఇస్తారు.
- 3, 4, 5వ తరగతుల పాఠ్యాంశాల్లో భాగంగా ‘ఇంట్లో తల్లిదండ్రులకు పిల్లలు ఎలా ఆసరాగా నిలవాలి? వాటి ప్రయోజనం ఏమిటో’ ఉపాధ్యాయులు బోధించాలి. శ్రమ, కష్టం గురించి తెలియజెప్పాలి.
- అప్పుడే భవిష్యత్తులో పిల్లలు ఒడుదొడుకులు తట్టుకోగలుగుతారు. గురుకులాలు, వసతి గృహాల్లో ఉండేవారికి తమ పనులన్నీ వారే చేసుకోవడం అలవాటవుతుంది.
"చాలావరకు విద్యాలయాల్లో మైదానాలు లేకపోవడంతో పిల్లలు ఆటలకు దూరమవుతున్నారు. చదువుతో పాటు తల్లిదండ్రులకు సహాయం చేసే పిల్లలకు పెద్దలతో సంబంధాలు బలపడతాయి. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉంటారు. ఏకాగ్రత పెరిగి చదువుల్లో రాణిస్తారు." -వీరభద్రం, సైకాలజిస్ట్
చిన్నచిన్న కారణాలతోనే యువత ఆత్మహత్యలు - ఈ పనితోనే వారిని కాాపాడుకోవచ్చు!
క్షణికావేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు - తప్పిదమెక్కడో గుర్తించకుంటే తీవ్ర నష్టమే!