GST Evasion Through Shadow Trading in Telangana : రాష్ట్రానికి రాబడిలో వెన్నుదన్నుగా ఉన్న రాజధాని హైదరాబాద్ నగరంలో యథేచ్ఛగా సాగుతున్న జీరో వ్యాపారంతో ప్రతినెలా రూ.కోట్లలో పన్ను ఎగవేతకు గురవుతోంది. జీఎస్టీ చెల్లించకుండానే ఇతర రాష్ట్రాల నుంచి భారీగా వస్తువులు తీసుకొచ్చి అమ్మకాలు చేస్తున్నారు. రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలో 15 డివిజన్లు ఉండగా వీటిలో 8 హైదరాబాద్‌లోనే ఉన్నాయి. కీలకమైన రాబడి అంతా ఈ డివిజన్లలో ఉంది. నగరంలోని పలు చోట్ల జీరో వ్యాపారం భారీగా సాగుతోందని ఉన్నతాధికారులు గుర్తించారు. దిల్లీ, మహారాష్ట్ర నుంచి నగరానికి పన్నులు చెల్లించకుండానే భారీగా వస్తువులను తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు తేలింది. ప్రధానంగా ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు జీఎస్టీ పరిధిలోకి వివిధ రకాల వస్తువులు ఉన్నాయి. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జామున 3 గంటల్లోపు వాహనాల్లో నగరానికి వస్తున్న సరుకును అక్రమంగా గోదాముల్లో నిల్వ ఉంచి విక్రయిస్తున్నారు.
పలు రాష్ట్రాల నుంచి వస్తువులు తీసుకొచ్చి : పన్నులు చెల్లించకుండా నగరానికి చేరుతున్న వాహనాలను అధికారులు గుర్తించడం లేదన్న ఫిర్యాదులు అందుతున్నాయి. వాహనాల తనిఖీలో జీరో వ్యాపారం సరకుల విషయంలో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చార్మినార్, పంజాగుట్ట, సికింద్రాబాద్, బేగంపేట, అబిడ్స్ డివిజన్ల పరిధిలో పలు ప్రాంతాల్లోని మార్కెట్లలో జీవో వ్యాపారం సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. కొందరు వ్యాపారులు దిల్లీ, హర్యానా, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి వస్తువులుతో పాటు వివిధ రకాల ఉత్పత్తులను తీసుకువస్తున్నారు. భారీ పరిమాణంలో నిల్వలు ఉంటున్నా గుర్తించే పరిస్థితి లేదు.
నిఘా లోపమే ప్రధాన కారణం : నిర్మాణానికి వినియోగించే స్టీలు విక్రయాల్లో భారీగా జీరో వ్యాపారం సాగుతున్నట్లు సమాచారం. నగర శివార్లలో పాటు నగరంలో పెద్ద స్టీలు వ్యాపారులు భారీ పరిమాణంలో ఈ అమ్మకాలు సాగుతున్నట్లు వాణిజ్య పన్ను శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో రూ.కోట్ల పన్ను ఎగవేత జరుగుతోందని వాణిజ్యపన్నుల శాఖ అధికారి ఒకరు తెలిపారు. దీనికి కారణం నిఘా లోపమే అన్నారు. ప్రత్యేకంగా విజిలెన్స్ విభాగం ఉన్నప్పటికీ నిఘా లోపంతో పాటు తనిఖీల జోలికి వెళ్లకపోవడంతో పెద్దమొత్తంలో ఆదాయం కోల్పోతుందన్నారు. బడా వ్యాపారులు ఇందులో ఉండడంతో అధికారులు ఆసక్తి చూపడం లేదని తెలిపారు.
కేంద్ర పరిహారం ఆగిపోవడంతో.. బడా సంస్థలపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నజర్
'రూ.5 కోట్లకు మించి జీఎస్టీ ఎగవేస్తే అధికారులే నేరుగా విచారించొచ్చు'