Stranger UPI Payment Fraud in Siddipet : టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, సైబర్ నేరాల సంఖ్య కూడా అదే స్థాయిలో విజృంభిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, అప్రమత్తంగా ఉన్నా ఏదో ఒక రూపంలో ప్రజలు నిత్యం మోసపోతూనే ఉన్నారు. నిన్నటివరకూ జరిగిన ఆన్లైన్ మోసాలు ఒక ఎత్తైతే, సరికొత్త పంథాలో యూపీఐ చెల్లింపులతో జరుగుతున్న దోపీడీలు మరో ఎత్తు.
అపరిచితులకు ఫోన్ ఇచ్చే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నా, సాయం చేసి నిలువు దోపీడీకి గురవుతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. అటువంటి మోసానికే సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలానికి చెందిన ఓ హోటల్ యజమాని బలయ్యాడు. ఏకంగా తన ఖాతా నుంచి రూ.96,000 స్వాహా అయ్యాయి.
ఇంతకీ ఏమి జరిగిందంటే,. రాజస్థాన్‌కు చెందిన నారాయణ గత ఐదు సంవత్సరాలుగా అక్కన్నపేట మండల కేంద్రంలో రాజస్థాన్ హోటల్‌ను నిర్వహిస్తున్నాడు. శుక్రవారం హోటల్‌కు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యక్తి టీ తాగేందుకు వచ్చాడు. టీ తాగిన తర్వాత తన వద్ద డబ్బులు లేవని తన మిత్రుడు గూగుల్ పే ద్వారా డబ్బులు పంపిస్తాడని ఫోన్ చేసి నెంబర్ చెప్పాలని హోటల్ నిర్వాహకుడిని అడిగాడు. దీంతో హోటల్ నిర్వాహకుడు నారాయణ ఆ వ్యక్తి చెప్పిన నెంబర్‌కు ఫోన్ చేయడంతో రూ.500 అవతలి వ్యక్తి గూగుల్ పే చేశాడు.
"తన స్నేహితుడితో మాట్లాడాలని, నా మొబైల్ అడిగాడు. అంతకముందు తన మిత్రుడు వేసిన రూ.500 వచ్చాయో లేదా అని చెక్ చేసుకోమని చెప్పాడు. ఆ సమయంలో నేను కొట్టిన యూపీఐ పిన్ గమనించాడు. నేను నా పనిలో ఉండగా, వాళ్ల మిత్రుడుతో మాట్లాడుతూ, నా ఖాతానుంచి ముందుగా రూ.90,000 జీ పే చేసుకున్నాడు. అది ఫెయిల్ అయ్యేసరికి రెండు దఫాలుగా రూ.48,000 చొప్పున పంపించుకొని అక్కడ నుంచి ఉడాయించాడు."-నారాయణ, హోటల్ నిర్వాహకుడు
UPI Overpayment Scam : అనంతరం సదరు వ్యక్తి హోటల్ నిర్వాహకుడిని ఒకసారి ఫోన్ ఇవ్వాలని, తన స్నేహితుడికి ఫోన్ చేసి మాట్లాడతానని తీసుకొని గూగుల్ పే ద్వారా రూ.96,000 తన మిత్రుడి ఫోన్ నెంబర్‌కు పంపించాడు. పనిలో పడిన సదరు హోటల్ నిర్వాహకుడు పట్టించుకోలేదు. తర్వాత చూసేసరికి తన అకౌంట్లో డబ్బులు లేవని, తాను మోసపోయినట్లు గుర్తించి వెంటనే మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హోటల్ నిర్వాహకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తాండ్ర వివేక్ తెలిపారు.
'మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తా - లిక్విడ్ క్యాష్ ఇవ్వరా' - ఇలా ఎవరైనా అడిగితే తస్మాత్ జాగ్రత్త
ఆన్లైన్ ఆర్డర్లతో డబ్బు మళ్లింపు - బయటపడ్డ బీటెక్ బాబు బాగోతం